మిస్ వరల్డ్-2014.. రోలిన్ స్ట్రాస్ | rolene strauss has been crowned miss world 2014 | Sakshi
Sakshi News home page

మిస్ వరల్డ్-2014.. రోలిన్ స్ట్రాస్

Published Thu, Dec 18 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

మిస్ వరల్డ్-2014.. రోలిన్ స్ట్రాస్

మిస్ వరల్డ్-2014.. రోలిన్ స్ట్రాస్

ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
 కరెంట్ అఫైర్స్ నిపుణులు

 
 జాతీయం: దేశంలో అతిపెద్ద సంస్థ.. ‘ఇండియన్ ఆయిల్’ 2014కు సంబంధించి దేశంలో అధిక ఆదాయం పొందుతున్న సంస్థలతో రూపొందించిన ‘ఫార్చ్యూన్ 500 జాబితా’ను ఫార్చ్యూన్ ఇండియా డిసెంబర్ 14న విడుదల చేసింది. రూ.5,00,973 కోట్ల ఆదాయంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రథమ స్థానంలో నిలిచింది. రూ.4,44,021 కోట్లతో రిలయన్స్ రెండో స్థానం, రూ.2,67,718 కోట్లతో భారత్ పెట్రోలియం మూడో స్థానం సాధించాయి. రూ.2,36,502 కోట్లతో టాటా మోటార్స్ ఐదో స్థానంలో నిలిచింది.
 
 పినాక మార్క్-2 పరీక్ష విజయవంతం
 స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పినాక మార్క్-2 రాకెట్‌ను భారత్ డిసెంబర్ 9న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ప్రూఫ్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (పీఎక్స్‌ఈ)లో ఈ ప్రయోగం నిర్వహించారు.
 
 ఆత్మహత్యాయత్నం నేరమనే సెక్షన్ తొలగింపు!
 ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించవద్దని, దీనికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (ఐపీసీ)లోని 309వ సెక్షన్‌ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ న్యాయ కమిషన్ చేసిన సిఫార్సుపై దేశంలోని 18 రాష్ట్రాలతో పాటు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు సానుకూలంగా స్పందించాయని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 10న రాజ్యసభలో వెల్లడించింది.
 
 భారత్, రష్యా మధ్య 20 ఒప్పందాలు
 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య డిసెంబర్ 11న ఢిల్లీలో సదస్సు జరిగింది. పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ సదస్సులో రక్షణ, చమురు, గ్యాస్, వైద్యం, గనులు, కమ్యూనికేషన్లు తదితర కీలక రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య 20 ఒప్పందాలు కుదిరాయి. రష్యా తన అత్యాధునిక హెలికాప్టర్‌ను భారత్‌లో తయారుచేసేందుకు అంగీకరించింది. వాణిజ్య చెల్లింపులను ఇరు దేశాల కరెన్సీలోనే జరుపుకునేందుకు ప్రోత్సహించాలని భారత్-రష్యాలు అంగీకరించాయి.    హైడ్రోకార్బన్ల ఉత్పత్తిలో సంయుక్త పరిశోధన, కుడంకుళం అణు కేంద్రంలో మూడు, నాలుగో యూనిట్‌ను నెలకొల్పడం వంటి ఒప్పందాలను ఇరుదేశాలకు సంబంధించిన సంస్థలు కుదుర్చుకున్నాయి.
 
 సున్నాకు చేరిన టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం
 టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ఈ ఏడాది నవంబర్‌లో సున్నాగా నమోదైంది. అంటే 2013 నవంబర్‌లో ఉన్న స్థాయిలోనే 2014 నవంబర్‌లో కూడా టోకు ధరలు ఉన్నట్లు. గత ఐదున్నరేళ్లలో ఇదే కనిష్టం. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇంధన, ఆహార ఉత్పత్తులు, తయారీ వస్తువుల ధరల తగ్గుదల వల్ల టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు సున్నా స్థాయికి చేరింది.
 
 వార్తల్లో వ్యక్తులు
 ప్రపంచ సుందరి.. రోలిన్ స్ట్రాస్
 మిస్ వరల్డ్-2014 కిరీటాన్ని మిస్ దక్షిణాఫ్రికా రోలిన్ స్ట్రాస్(22) దక్కించుకుంది. డిసెంబర్ 14న లండన్‌లోని ఎక్సెల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగిన ఫైనల్ పోటీల్లో ఆమె విజయం సాధించింది. రోలిన్ ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తోంది. రోలిన్ తర్వాత రెండు, మూడు స్థానాల్లో హంగరీకి చెందిన కల్సర్, అమెరికా సుందరి సఫ్రిత్ నిలిచారు. భారత్ తరఫున ‘మిస్ వరల్డ్ 2014’లో పోటీపడిన ఢిల్లీకి చెందిన కోయల్ రాణా(21) టాప్ 10లోకి చేరుకోగలిగినా, టాప్-5లోకి చేరడంలో విఫలమైంది. కోయల్‌కు ఈ పోటీల్లో ‘బెస్ట్ డిజైనర్ అవార్డు’ దక్కింది. పోటీలో మొత్తం 121 దేశాల సుందరీమణులు పాల్గొన్నారు.
 
 జపాన్ ప్రధానిగా మరోసారి అబే
 జపాన్ ప్రధానిగా షింజో అబే మరోసారి ఎన్నికయ్యారు. ఆయన చేపట్టిన ‘అబేనామిక్స్’ ఆర్థిక విధానాలకు రిఫరెండంగా భావించిన మధ్యంతర ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. అయినా ఎన్నికల్లో అబే సునాయాసంగా విజయం సాధించారు. పార్లమెంటు ప్రతినిధుల సభలోని 475 సీట్లకు అబే నేతృత్వంలోని లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎల్‌డీపీ) మూడింట రెండొంతుల స్థానాలు గెలుచుకుంది. దేశ ఆర్థికాభివృద్ధికి అబే అనుసరించిన ఆర్థిక విధానాలను ‘అబేనామిక్స్’గా పేర్కొంటున్నారు.
 
 మారిషస్ ప్రధానిగా అనిరుధ్ జగన్నాథ్
 మారిషస్ పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన అనిరుధ్ జగన్నాథ్(84) డిసెంబర్ 14న ప్రధానిగా నియమితులయ్యారు. జగన్నాథ్ నేతృత్వంలోని  ‘లెపెప్’ కూటమి పార్లమెంటులోని మొత్తం 62 సీట్లకు 47 స్థానాలను గెలుచుకుంది. జగన్నాథ్ 1982-95, 2000-2003 మధ్య ప్రధానిగా, 2003-12 మధ్య అధ్యక్షుడిగా పనిచేశారు.
 
 నోబెల్ పురస్కారాన్ని అందుకున్న సత్యార్థి, మలాలా
 బాలల హక్కుల కోసం పోరాడుతున్న భారత్‌కు చెందిన కైలాశ్ సత్యార్థి(60), పాక్ బాలిక మలాలా యూసఫ్ జాయ్(17) డిసెంబర్ 10న నోబెల్ శాంతి పురస్కారాన్ని సంయుక్తంగా స్వీకరించారు. నార్వే రాజధాని ఓస్లొలో జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో నోబెల్ కమిటీ చైర్మన్ తోబ్‌జోర్న్ జాగ్లండ్ ఇద్దరికీ అవార్డు అందించారు. బహుమతి కింద నోబెల్ బొమ్మ గల 175 గ్రాముల బంగారు పతకం, సుమారు రూ.6.1 కోట్ల నగదు బహుమతి ధ్రువీకరణపత్రం, నోబెల్ డిప్లొమా అందజేశారు. సత్యార్థి తన స్వచ్ఛంద సంస్థ బచ్‌పన్ బచావో ఆందోళన్ ద్వారా దేశ వ్యాప్తంగా 80 వేల మంది బాలకార్మికులను రక్షించి, పాఠశాలల్లో చేర్పించారు. మలాలా నోబెల్ అవార్డు అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలు.
 
 దాతృత్వంలో నెం.1 బఫెట్
 వివిధ కార్యక్రమాల కోసం 2014లో అధికమొత్తంలో విరాళమిచ్చిన దాతల జాబితాలో వారెన్ బఫెట్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు ఏకంగా 2.1 బిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ జాబితాను ‘వెల్త్- ఎక్స్’ రూపొందించింది.
 
 ఇంటెలిజెన్స్ బ్యూరో డెరైక్టర్‌గా దినేశ్వర్ శర్మ
 ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దినేశ్వర్ శర్మ డిసెంబర్ 13న నియమితులయ్యారు. 1979 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన శర్మ ప్రస్తుత డెరైక్టర్ సయ్యద్ అసిఫ్ ఇబ్రహీం స్థానంలో 2015, జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
 
  అంతర్జాతీయం
 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21
 జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ మేరకు భారతదేశం ప్రతిపాదించిన తీర్మానానికి డిసెంబర్ 11న ఐరాస సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. భారత రాయబారి అశోక్ ముఖర్జీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 193 సభ్యదేశాలున్న సమితిలో రికార్డు స్థాయిలో 177 దేశాలు మద్దతు ప్రకటించాయి. జూన్ 21న సుదీర్ఘమైన పగటి రోజు కావడంతో చాలాదేశాల్లో ఈ తేదీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
 
 లిమాలో ముగిసిన వాతావరణ సదస్సు
 పెరూ రాజధాని లిమాలో 13 రోజుల పాటు జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు (సీఓపీ-20) డిసెంబర్ 14న ముగిసింది. వాతావరణ కార్యాచరణకు లిమా పిలుపు (లిమా కాల్ టు క్లైమేట్ యాక్షన్) పేరుతో రూపొందించిన పత్రం ఆమోదంతో సదస్సు పూర్తయింది. ఈ పత్రానికి 196 దేశాలు ఆమోదం తెలిపాయి. 2015 డిసెంబర్‌లో పారిస్‌లో రూపొందే ఒప్పందానికి జరిగే చర్చల కోసం విధానపత్రంగా దీన్ని రూపొందించారు.
 
 ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎబోలా చికిత్సకారులు
 ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ కట్టడికి అవిశ్రాంతంగా పోరాడుతున్న వైద్యులు, నర్సులు, సహాయకులను ఉమ్మడిగా   పర్సన్ ఆఫ్ ది ఇయర్ (2014)గా టైమ్ మ్యాగజైన్   ప్రకటించింది. చికిత్స అందించే క్రమంలో సహచర వైద్యులు వైరస్ బారినపడి మరణించినా, ధైర్యంతో సేవలు అందిస్తున్నందుకు తుది ఎనిమిది మంది జాబితాలోంచి వీరిని ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు మ్యాగజైన్ ఎడిటర్ నాన్సీ గిబ్స్ డిసెంబర్ 10న  ప్రకటించారు.
 
 క్రీడలు
 గద్దె రుత్వికకు మహిళల సింగిల్స్ టైటిల్
 టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్వికా శివాని మహిళల సింగిల్స్ టైటిల్ సాధించింది. ముంబైలో డిసెంబర్ 14న జరిగిన ఫైనల్లో రుత్విక.. మహారాష్ట్రకు చెందిన అరుంధతి పంతవానెపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో గురుసాయిదత్.. హెచ్.ఎస్.ప్రణయ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను సుమీత్‌రెడ్డి-మను అత్రి, మహిళల డబుల్స్ టైటిల్‌ను అపర్ణా బాలన్-ప్రజక్తా సావంత్ గెలుచుకున్నారు.
 
 జర్మనీకి ‘చాంపియన్స్ ట్రోఫీ’
 చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో జర్మనీ జట్టు విజేతగా నిలిచింది. డిసెంబర్ 14న భువనేశ్వర్‌లో కళింగ మైదానంలో జరిగిన ఫైనల్లో 2-1తో పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించింది. 2007 తర్వాత మరోసారి టైటిల్‌ను సాధించిన జర్మనీకి ఇది పదో ట్రోఫీ. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి, నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఉత్తమ గోల్ కీపర్‌గా పి.శ్రీజేష్ ఎంపికయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీని అత్యధికంగా ఆస్ట్రేలియా 13సార్లు గెలుచుకుంది.
 
 ఇండియన్ ఏసెస్‌కు ఐపీటీఎల్ టైటిల్
 ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) టైటిల్‌ను భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్ గెలుచుకుంది. దుబాయిలో డిసెంబర్ 13న ముగిసిన పోటీల్లో యూఈఏ రాయల్స్ రెండో స్థానంలో నిలిచింది. ఈ పోటీలను నిర్వహించడం ఇదే తొలిసారి. టైటిల్ గెలుచుకున్న ఇండియన్ ఏసెస్‌కు రూ.6.26 కోట్ల నగదు బహుమతి దక్కనుంది.
 
 ఆనంద్‌కు ‘లండన్’ టైటిల్
 భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. లండన్‌లో జరిగిన పోటీలో బ్రిటిష్ గ్రాండ్ మాస్టర్ మైకేల్ ఆడమ్స్‌ను ఓడించాడు. ఈ టైటిల్‌ను ఆనంద్ గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఆనంద్‌కు రూ.39 లక్షల 20 వేలు నగదు బహుమతి లభించింది.
 
 రాష్ట్రీయం: తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా నిరంజన్‌రెడ్డి
 తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నియమితులయ్యారు. దీనికి సంబంధించి డిసెంబర్ 15న ఉత్వర్వులు జారీఅయ్యాయి.
 
 నెలలో ఒక రోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్
 2015 నుంచి నెలలో ఒక రోజును ‘స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ డే’గా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నిర్ణయించారు.
 
 రాజధాని భూ సమీకరణ ప్యాకేజీ
 ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి చేపట్టే భూ సమీకరణ విధానాన్ని; రైతులకు, భూ యజమానులకు అందించే ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 8న ప్రకటించారు. ఈ ప్యాకేజీ కింద జరీబు (నదీతీర ప్రాంత భూములు), జరీబ్ అసైన్డ్ భూముల రైతులకు ఎకరాకు రూ.50 వేల కౌలును పదేళ్ల పాటు చెల్లిస్తారు. దీన్ని ఏటా రూ.5 వేలు పెంచుతారు. మెట్ట, మెట్ట అసైన్డ్ భూముల రైతులకు ఎకరాకు రూ.30 వేలు చెల్లిస్తారు. ఏటా రూ.3 వేలు  పెంచుతారు.
 
 ‘ది వీక్’ ఉమన్ ఆఫ్ ది ఇయర్‌గా రుక్మిణీరావు
 తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త వి.రుక్మిణీరావును ‘ది వీక్’ మ్యాగజైన్ ఉమన్ ఆఫ్ ది ఇయర్-2014గా ఎంపిక చేసింది. ఆమె గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన మహిళల సంక్షేమం కోసం కృషి చేశారు. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ, డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్), గ్రామ్యా తదితర స్వచ్ఛంద సంస్థల్లో భాగస్వామిగా పనిచేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement