అధికార పార్టీతో కాంగ్రెస్ డీల్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పొత్తులకు తెరలేవబోతున్నది. అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. ఈ మేరకు రెండు పార్టీలు సీట్ల పంపకాలపై డీల్ కుదుర్చుకునే దిశగా కదులుతున్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా ఎన్నికల్లో ముందుకుసాగాలని, ఇరుపార్టీలకు గట్టి పట్టున్న సీట్లపై పట్టువిడుపుల ధోరణి కొనసాగించాలని ఇప్పటివరకు తెరవెనుక జరిగిన పొత్తు చర్చల్లో రెండు పార్టీలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
కూటమి భాగస్వాములుగా యూపీ ఎన్నికలను ఎదుర్కోబోతున్న రెండు పార్టీల అగ్రనేతలు - కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్- ఇంకా భేటీ కానప్పటికీ పొత్తు కుదుర్చుకోవడానికి కావాల్సిన సన్నాహాలన్నీ పూర్తయ్యయాయని, ఈ పొత్తు చర్చలు చాలావరకు మధ్యవర్తుల ద్వారా, టెలిఫోన్ చర్చల ద్వారా జరిగాయని, సీట్ల పంపకం, కనీస ఉమ్మడి కార్యక్రమంపై ఇప్పటికే ఇరుపార్టీల మధ్య విస్తృత ఏకాభిప్రాయం వచ్చిందని ఆ పార్టీ అగ్రస్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్, ఎస్పీల మధ్యే పొత్తు చర్చ నడుస్తోందని, తమ కూటమిలో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆరెల్డీ)ను చేర్చుకునే విషయమై ఇంకా చర్చించలేదని, కానీ మున్ముందు మరిన్ని చిన్న పార్టీలను కూటమిలో కలుపుకొనే విషయమై చర్చిస్తామని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.