ఆ పార్టీతో పొత్తులేదని తేల్చేసిన ఎస్పీ
Published Thu, Jan 19 2017 8:18 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులతో బీజేపీని ఎదుర్కోవాలని పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్న సమాజ్వాద్ పార్టీ, తమలో రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ)ని కలుపుకుంటుందనే వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టేసింది. ఆర్ఎల్డీతో తాము ఎలాంటి పొత్తు కుదుర్చుకోమంటూ సమాజ్వాద్ పార్టీ గురువారం తేల్చేసింది. తాము కేవలం కాంగ్రెస్ పార్టీతోనే పొత్తుపెట్టుకుంటామని పేర్కొంది.
'' ఎస్పీ కేవలం కాంగ్రెస్తోనే పొత్తుకు సిద్ధంగా ఉన్నాం. ఆర్ఎల్డీతో పొత్తుపెట్టుకోం. ఆర్ఎల్డీతో ఎలాంటి చర్చలు జరుపడం లేదు. మొత్తం 403 సీట్లలో 300 సీట్లలో ఎస్పీ పోటీ చేస్తాం. మిగతా 103 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది'' అని సమాజ్వాద్ పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్మయ్ నందా స్పష్టంచేశారు. పార్టీ సీనియర్ లీడర్లు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో ఆరుగంటల పాటు జరిపిన చర్చలానంతరం పొత్తులపై నిర్ణయాన్ని ప్రకటించారు. ఎస్పీ ఇస్తానన్న సీట్ల కంటే ఆర్ఎల్డీ ఎక్కువ సీట్లను కోరుతుందని అందుకే పొత్తు చర్చలు కుదరలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Advertisement
Advertisement