అంతరిక్ష కేంద్రంలో మొక్కలు పెంచేస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక రంగంలో ఎప్పటికప్పుడు అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ మానవుడు తన మనుగడను భూమి నుంచి అంతరిక్షంలోకి తీసుకుపోతున్నాడు. మానవుడు తలచుకోవాలేగానీ నేల, నీరు లేకుండా కూడా మొక్కలు పెంచవచ్చని నిరూపించాడు.
తాజాగా అంతరిక్ష స్పేస్ స్టేషన్‌లో సంవత్సరాలుగా ఉంటున్న వ్యోమగాములు అక్కడ ఏకంగా మొక్కలు పెరగడానికి అనుకూల వాతావరణం కల్పించి ఆకుపచ్చని మొక్కలను పెంచేస్తున్నారు. అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ వాతావరణంలో నాసాకు చెందిన వ్యోమగామి స్కాట్ కెల్లీతోపాటు 44 మంది వ్యోమగాములు మొట్టమొదటి సారిగా ఈ మొక్కలను పెంచారు. వీటి నుంచి వచ్చే ఆహార పదార్థాలను తినడానికి ప్రత్యేక పద్ధతిలో శుభ్రపరిచి తింటారు.
అంతేకాకుండా అక్కడ పండిన వాటిని మరిన్న పరిశోధనల కోసం భూమిపైకి కూడా పంపించనున్నారు. నాసా ప్రారంభించిన వెజ్-01 కార్యక్రమంలో భాగంగా అంతరిక్షంలో మొక్కల పెంపకంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇది పూర్తిగా విజయవంతమైతే అంతరిక్షంలో వ్యోమగాములు టమాటా, రెడ్‌బెర్రీస్ లాంటి తాజా వాటిని తినొచ్చు.