నింగీ నేలా ఏకమయ్యేలా...
అంతరిక్షంలోకి వెళ్లి దాని లోతులు తెలుసుకోవాలనే తపన ఉన్నవారు శారీరకంగా, మానసికంగా ఎంతో బలంగా ఉండాలి. కఠోర శిక్షణ పూర్తి చేయాలి. వ్యోమగాముల పొడవు కనీసం 147 సెంటీ మీటర్లు (4 అడుగుల 8 అంగుళాలు) ఉండాలి. కంటిచూపు బాగుండాలి. రక్తపోటు ఉండకూడదు. విద్యాధికులై ఉండాలి. వయసుకి ఎలాంటి పరిమితి లేకపోయినప్పటికీ సాధారణంగా 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికే శిక్షణ ఇస్తారు.
భూ కక్ష్యను దాటి పైకి వెళ్లే కొద్దీ వ్యోమగాములు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైనది భారరహిత స్థితి. వ్యోమగాముల్ని తీసుకువెళ్లే ఉపగ్రహం భూమి దాటి పైకి వెళ్తున్న కొద్దీ శరీరం బరువు తగ్గిపోతుంది. ఆ సమయంలో గురుత్వాకర్షణ శక్తికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. రేడియేషన్ అధికంగా ఉండటంతో శారీరకంగా ప్రభావం పడుతుంది. ఎక్కువ మందిలో మోషన్ సిక్నెస్, రక్త ప్రసరణలో తేడాలు కనిపిస్తాయి. సరైన శిక్షణ ఇవ్వకపోతే వ్యోమగాములు స్పృహ కోల్పోయే అవకాశం ఉంది.
మైక్రో గ్రావిటీ, మానవ సంచారం లేకుండా ఒంటరిగా ఉండటం, శూన్యంలో ప్రయాణం వంటివి వ్యోమగాముల్ని మానసికంగా దెబ్బ తీయకుండా ఈ శిక్షణ ఇస్తారు. అంతరిక్షంలో ఉండే వాతావరణాన్ని భూమిపై కృత్రిమంగా నెలకొల్పిన సిమ్యులేటర్లలో కఠోర శిక్షణ ఇస్తారు. వాతావరణంలో ఉన్న ఒత్తిడి కంటే ఆరు రెట్లు అధికమైన ఒత్తిడి ఈ సిమ్యులేటర్లలో ఉంటుంది. వీటిలో శిక్షణ తీసుకుంటే భార రహిత స్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడం, రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, వాతావరణంలో త్వరత్వరగా వచ్చే మార్పుల్ని తట్టుకునే శారీరక సామర్థ్యం, అంతరిక్ష వాతావరణంలో శరీరంపై పడే దుష్ప్రభావాలను తగ్గించుకునే సామర్థ్యం వంటివి పెరుగుతాయి.
అన్నింటికి మించి శరీరం తలకిందులుగా ఉన్నప్పుడు అన్ని పనుల్ని చక్కబెట్టే సామర్థ్యం, స్పేస్ వాక్ వంటి వాటిల్లో శిక్షణ ఉంటుంది. అత్యంత ఇరుకుగా ఉండే కాప్సూ్యల్లో ప్రయాణం కూడా అత్యంత క్లిష్టమైనదే. ఇవే కాకుండా స్పేస్‌క్రాఫ్ట్ నిర్వహణపై కూడా శిక్షణ ఇస్తారు. మిషన్‌లో వచ్చే సాంకేతిక లోపాల్ని సరిదిద్దడం, ఉపగ్రహ ప్రయాణం ఏ దిశగా వెళుతోందో గమనిస్తూ ఉండటం, అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యం వంటివాటిలో శిక్షణ ఇస్తారు. ఇక హైడ్రోల్యాబ్స్లో నీళ్లల్లో భారరహిత స్థితిలో ఉండటంపై శిక్షణ కూడా ఉంటుంది.