హోదా హక్కు.. భిక్ష కాదు | special status is andhra pradesh right, says narayana | Sakshi
Sakshi News home page

హోదా హక్కు.. భిక్ష కాదు

Published Wed, Oct 21 2015 7:44 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదా హక్కు.. భిక్ష కాదు - Sakshi

హోదా హక్కు.. భిక్ష కాదు

ప్రత్యేక ప్యాకేజీ అంటే అడుక్కుంటే వచ్చే ఆదాయం లాంటిది
కేంద్రాన్ని నిలదీసే ధైర్యం బాబుకు లేదు
ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్రమంత్రులతో రాజీనామా చేయించాలి
వెంకయ్య నోటిని పినాయిల్ పోసి కడగాలి
రాజకీయ పోరాటమే శరణ్యం
సాక్షితో సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ


సాక్షి, హైదరాబాద్: విభజన సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కే గానీ భిక్ష కాదని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హోదాకు బదులుగా ప్యాకేజీ అంటే భిక్షాటనతో వచ్చే ఆదాయానికీ హక్కుగా వచ్చే ఆదాయానికీ ఉన్నంత తేడా ఉంటుందన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులతో రాజీనామా చేయించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా సాధన ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణంలో నారాయణ బుధవారమిక్కడ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీయమానసిక ధోరణి వదులుకోవాలని హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

హోదా అవశ్యం, అనివార్యం...

కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా అవశ్యం, అనివార్యం. హోదా ఉంటే కొన్ని రాయితీలు వాటంతటవే వస్తాయి. ప్రైవేటు సంస్థలు, పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతారు. పన్ను రాయితీలుంటాయి. కేంద్రం నుంచి హక్కుగా నిధులు వస్తాయి. అడుక్కోవాల్సిన పని ఉండదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేక పోవడం వల్ల పరిశ్రమలు రావడం లేదు. పన్నుల రాయితీలు లేవు. హోదా ఉంటే రాజధానిని సైతం కేంద్రమే నిర్మించేది. ఇప్పటివరకు ఇచ్చింది ఏపీకి సహజంగా రావాల్సిన నిధులే తప్ప కొత్తవి కావు. ఫలితంగా ఖాళీ ఖజానా మిగిలింది.

ప్రత్యేక ప్యాకేజీతో ఉపయోగమేముంటుందీ?

ప్రత్యేక హోదా అంటే హక్కు. ప్రత్యేక ప్యాకేజీ అంటే భిక్ష. కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పని లేకుండా హోదా ఇవ్వాలి. మనకు రావాల్సిన నిధులన్నింటినీ కలిపి ప్యాకేజీగా ఇస్తే ఉపయోగమేముంటుందీ? బీహార్ ప్యాకేజీ చూశారుగా.. రెండు మూడేళ్లుగా ఆ రాష్ట్రానికి వివిధ పద్దుల కింది రావాల్సిన నిధులన్నింటినీ కలిపి ప్యాకేజీ ప్రకటించి మభ్యపెట్టారు. ఏపీకీ అదే జరుగుతుంది.

చట్టాన్ని మార్చొచ్చు...

ప్రత్యేక హోదాకు ఏపీ అన్ని విధాలా అర్హమైందని అన్ని పార్టీలూ అంటున్నాయి. సమస్య మంచిదైనప్పుడు సాంకేతికపరమైన చిక్కుల్ని పరిష్కరించి చట్టాన్ని మార్చొచ్చు. పార్లమెంటులో ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి విలువ లేకపోతే మరి దేనికుంటుందీ? ఇందుకు నడుంకట్టాల్సిన వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు- పచ్చి అవకాశవాదులుగా మారారు. రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారు. పదేళ్లని ఒకరు, 15 ఏళ్లని మరొకరు ఎన్నికల్లో అవాకులు చెవాకులు పేలిన ఈ పెద్దలు ప్రస్తుతం ఇదేమన్నా సంజీవనా? అంటున్నారు. వెంకయ్యది ఏం నోరది? పినాయిల్ పోసి కడిగాలి.

కేంద్రాన్ని అడిగే ధైర్యం బాబుకు లేదు!

చంద్రబాబు పరిస్థితి మరీ దైన్యంగా ఉంది. కేంద్రాన్ని ధైర్యంగా అడిగే పరిస్థితి బాబుకు లేదు. తాను మాట్లాడలేనప్పుడు ప్రతిపక్షాలను కలుపుకుని పోయే తత్వమూ లేదు. కేంద్రాన్ని నిలదీయాలనుకున్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో విపక్షాలను ఢిల్లీకి తీసుకువెళ్లారు. చంద్రబాబూ కొన్నిసార్లు ఆ పని చేశారు. ఇప్పుడెందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. రాజకీయ పోరాటం చేయాల్సిన స్థితిలో మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారు.

మంత్రుల్ని ఉపసంహరించుకోవాలి...

మోదీని నిలదీసేందుకు మొత్తం ప్రతిపక్షాలను ఢిల్లీకి తీసుకువెళ్లాలి. అప్పటికీ మాట వినకపోతే కేంద్ర క్యాబినెట్‌లోని టీడీపీ మంత్రుల్ని ఉపసంహరించుకోవాలి. ప్రత్యేక హోదా సాధించుకోలేనప్పుడు ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉండడం ఎందుకు? పోరాటం చేస్తే ఫలితమేముంటుందని వెంకయ్య, చంద్రబాబు ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. బాబు స్వీయమానసిక ధోరణితో ఉన్నారు.

ఓ పక్క జగన్, మరోపక్క మేము...

ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలే చిత్తశుద్ధితో పోరాడుతున్నాయి. ఓ పక్క వామపక్షాలు, మరో పక్క ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఊకదంపుడు ఉపన్యాసాలు మాని విపక్షాలతో కలిసి ఉద్యమించాలి. మనకు రావాల్సిన దాన్ని పోరాడి సాధించుకోవడంలో తప్పులేదు. భవిష్యత్‌లో అంతా కలిసి పని చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు సీపీఐ తన వంతు పాత్ర పోషిస్తుంది.

ప్రధాని ఏదో ఒకటి చెప్పాలి...

రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదాపై గురువారం స్పష్టత ఇవ్వాలి. ఐదు కోట్ల మంది ఆకాంక్షను పట్టించుకోవడం పాలకుల విధి. అలా చేస్తారనే భావిస్తున్నాం. లేకుంటే ఆ మర్నాటి నుంచే ఉద్యమించాలని మా పార్టీ నిర్ణయించింది.

అదేమన్నా మతపరమైన ఉత్సవమా?

రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఓ మతపరమైన పండుగలా మారుస్తున్నారు ముఖ్యమంత్రి. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేమన్నా చంద్రబాబు ఇల్లు కాదు, వ్యాపారమూ కాదు. అందరికీ చెందిన రాజధానిని ఏ ఒక్క మతానికో పరిమితం చేయడం సరికాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement