బాబుకు ప్రత్యేక హోదాపై శ్రద్ధ లేదు
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాలపై చూపిన శ్రద్ధ ప్రత్యేకహోదా సాధనపై చూపించడం లేదని ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర కేంద్ర హామీల సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీనటుడు శివాజీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ అధ్యక్షతన జరిగిన ప్రత్యేకహోదా సాధన సమాఖ్య సమావేశంలో సినీనటుడు శివాజీ మాటాడారు. ప్రజలు నమ్మి చంద్రబాబుకు రాష్ట్రాన్ని అప్పగిస్తే.. సమస్యలను పూర్తి గా పక్కన పెట్టేసి పదవుల కోసం పబ్బం గడుపుకోవడం తప్పితే చేసిందేమి లేదని విమర్శించారు.
ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రతి పక్షం మాట్లాడితే సీబీఐ కొరడా తీస్తున్నారని ఆరోపించారు. హోదా సాధనకు ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పైనా ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ ధర్నాకు సాధన మద్దతు..
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్‌సీపీ వచ్చే నెల 10న ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాకు కేంద్ర హామీల సాధన సమాఖ్య మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ సమాఖ్య గౌరవాధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన బస్సు యాత్రకు పూర్తి మద్దతు పలికారు. వచ్చే నెల 5న ఏలూరులో తలపెట్టిన ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా కోరారు.
అడ్‌హాక్ కమిటీ ఎన్నిక..: ప్రత్యేక హోదా, ఇతర కేంద్ర హామీల సాధన సమాఖ్య అడ్‌హాక్ కమిటీ అధ్యక్షుడిగా సినీనటుడు శివాజీ ఎన్నికయ్యారు. కమిటీ గౌరవాధ్యక్షుడిగా ఆంధ్రమేధావుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా సదాశివరెడ్డిలను ఎన్నుకున్నారు. తన సహా ఏపీలోని విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీలతో పాటు రైతు, ప్రజా, కుల సంఘాల నేతలందరూ కన్వీనర్లుగా ఉంటారని కారెం శివాజీ వెల్లడించారు.