మెగా స్పెక్ట్రమ్ వేలానికి డేట్ ఫిక్స్
న్యూఢిల్లీ : మెగా స్పెక్ట్రమ్ వేలానికి డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ లో ఈ వేలం నిర్వహించనున్నట్టు టెలికాం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఈ వేలంతో ప్రభుత్వ ఖజానాకు రూ.5.66లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. సిన్హా తన మొదటి మీడియా మీటింగ్ లో ఈ విషయాన్ని సిన్హా వెల్లడించారు. అదేవిధంగా కాల్ డ్రాప్స్ సమస్యను కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకుని, పరిస్థితిని చక్కబెడతామన్నారు. గత నెలలో మెగా స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ సారి నిర్వహించబోయే వేలమే అన్ని స్పెక్ట్రమ్ వేలంలో కెల్లా అతిపెద్దది. ట్రాయ్ సిఫారసులతో 3జీ, 4జీ ఆఫర్ చేసే క్వాంటమ్ 2,200 మెగాహెడ్జ్ పైగా స్పెక్ట్రమ్ ను ప్రభుత్వం తొలిసారిగా వేలం వేయబోతోంది. అయితే అందుబాటులో ఉన్న అన్ని స్పెక్ట్రమ్ లను ప్రభుత్వం విక్రయించబోదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ధర ఆందోళనలు, మునుపటి అమ్మకాల అవసరాలతో పోలిస్తే ఆపరేటర్ల పరిమిత అవసరాలు.. అన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ వేలాన్ని వేయనున్నట్టు తెలుస్తోంది.
20 రోజుల తర్వాత కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారంపై కూడా పూర్తి వివరాలను వెల్లడిస్తామని సిన్హా తెలిపారు. వచ్చే నాలుగు, ఐదు నెలలో ఈ సమస్య నుంచి వినియోగదారులు పూర్తిగా ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీల ద్వారా 90శాతం టెలి డెంసిటీ టార్గెట్లను టెలికాం ఇండస్ట్రి సాధించిందని సిన్హా తెలిపారు. టెలికాంలో దాదాపు రూ.46వేల కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని.. దాన్ని కేంద్రప్రభుత్వం చాపకింద దాచిపెడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వాలపై రుద్దకూడదన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అలాంటి ఫిర్యాదులేమి రాలేదని, నిర్దేశిత గడువులోగానే టెలికాం ఆపరేటర్ల నుంచి సొమ్మును వసూలుచేస్తున్నామని సిన్హా తెలిపారు.