టైమ్‌స్క్వేర్ సమీపంలో 'స్పైడర్ మ్యాన్'ను అరెస్ట్ చేసిన పోలీసులు
న్యూయార్క్: సినిమాలో అయితే ఎన్ని వేషాలు వేసినా కుదురుతుంది. స్పైడర్మ్యాన్ వేషం వేసి సినిమాలలో ఎలా చేసినా పరవాలేదు. పిల్లల నుంచి అందరూ చూస్తారు. ఆనందిస్తారు. అదే నిజజీవితంలో అయితే జైలు పాలు కావలసిందేనని న్యూయార్కులో జరిగిన ఓ సంఘటన రుజువు చేసింది. న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్ ప్రాంతంలో జూనియర్ బిషప్ అనే 25 ఏళ్ల వ్యక్తి స్పైడర్‌మాన్ డ్రెస్ వేసుకుని పర్యాటకులను అకట్టుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది.
తనతో ఫొటోలు తీయించుకోవాలంటే 5 నుంచి 20 డాలర్ల వరకూ ఇచ్చుకోవాలని పర్యాటకులను ఆ స్పైడర్‌మాన్ డిమాండ్ చేస్తున్నాడు. వారిని ఇబ్బంది పెడుతున్నాడు. అది చూసిన ఓ పోలీసు అధికారి జోక్యం చేసుకున్నారు. పర్యాటకులను వేధించవద్దని అతనికి సూచించారు. గుర్తింపు కార్డు అడిగితే ‘ఇది నీకు సంబంధించినది కాదు’ అని రెటమతంగా సమాదానం చెప్పాడు. అంతే కాకుండా వేషం వేసుకోగానే స్పైడర్‌మాన్ అయిపోయాననుకున్నాడో ఏమో అరెస్ట్ చేయబోయిన పోలీసుపై చేయి కూడా చేసుకున్నాడు. అంతదాక వచ్చిన తరువాత పోలీసులు ఊరుకుంటారా? ఓ పది మంది పోలీసులు వచ్చి అతనిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. వారికి ఎదురు తిరిగాడు. పోలీసులతో పెనుగులాడాడు. ఎట్టకేలకు పోలీసులు స్పైడర్‌మాన్ను కిందపడవేసి బేడీలు వేసి అరెస్ట్ చేశారు.