ఆడియో ఫంక్షన్‌లో సీనియర్ నటుడి వెకిలి కూతలు
హైదరాబాద్: నాగచైతన్య హీరోగా వస్తోన్న 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో ఫంక్షన్ సందర్భంగా టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు అమ్మాయిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ వేడుకలో ఈ పెద్దాయన అనుచిత వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. విలక్షణ నటన, విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకున్న చలపతి వెకిలి మాటలపై దుమారం రేగుతోంది. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన చలపతిరావులాంటి పరిశ్రమ పెద్దలు అమ్మాయిలను కించపరిచేవిధంగా మాట్లాడడం తగదని కమెంట్ చేస్తున్నారు.
అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ జంటగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్‌లో ముందు వరుసలో కూర్చున్న చలపతినుద్దేశించి అమ్మాయిల మనశ్శాంతికి హానికరమా అని యాంకర్ ప్రశ్నించినపుడు చలపతి ఇచ్చిన సమాధానంతో అక్కడున్నవారంతా నివ్వెరపోయారు. రాయడానికి కూడా మనస్కరించని రీతిలో చెలరేగిపోయాడు. దీంతో తలపండిన ఈ సీనియర్ నటుడి వల్గర్ కమెంట్లపై విస్తుపోయారు.