కూచిభొట్ల హత్య కేసు: కోర్టుకు నిందితుడు
విచారణ మే 9కి వాయిదా
హూస్టన్: హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాల్చిచంపిన నౌకాదళ విభాగం మాజీ ఉద్యోగి ఆడం పూరింటన్ గురువారం స్థానిక న్యాయస్థానం ఎదుట హాజరయ్యాడు. నారింజ రంగుతో కూడిన జంప్‌సూట్ ధరించిన పూరింటన్ విచారవదనంతో కనిపించాడు. అయితే ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉన్నందువల్ల మరికొంత సమయం కావాలని హంతకుడి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఈ కేçసు తదుపరి విచారణను కోర్టు మే నెల తొమ్మిదో తేదీకి వాయిదావేసింది.
శ్రీనివాస్, అతని స్నేహితుడు మేడసాని అలోక్.ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి కన్సాస్‌లోని ఓ బార్‌కు వెళ్లడం. అక్కడ నిందితుడు పూరింటన్ వీరికి తారసపడడం తెలిసిందే. ‘మీరు మధ్యప్రాచ్యానికి చెందినవారు కదా. మా దేశం విడిచివెళ్లిపోండి’ అంటూ తొలుత శ్రీనివాస్, అలోక్‌లతో గొడవకు దిగాడు. ఆ తర్వాత బార్ నిర్వాహకులు అతనిని అక్కడి నుంచి బలవంతంగా బయటికి పంపగా కొద్దిసేపటి తర్వాత మళ్లీ అక్కడకు చేరుకుని ఆకస్మికంగా వీరిరువురిపై కాల్పులు జరపగా శ్రీనివాస్ చనిపోవడం తెలిసిందే.