
అమరావతిలో ఎస్‌ఆర్‌ఎంను ఏర్పాటు చేయండి
♦ వర్సిటీ యాజమాన్యానికి చంద్రబాబు పిలుపు
♦ చెన్నైలో ఘనంగా ఎస్‌ఆర్‌ఎం స్నాతకోత్సవం
సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని అమరావతిలో విద్యాసంస్థను నెలకొల్పేందుకు ముందుకు రావాలని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ స్నాతకోత్సవం శనివారం చెన్నై శివారు కాటాన్ కొళత్తూరులోని టీపీ గణేషన్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. వర్సిటీ చాన్స్‌లర్ టీఆర్ పారివేందర్ అధ్యక్షతన జరిగిన ఈ స్నాతకోత్సవానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పీహెచ్‌డీ, బంగారు పతకాలు, డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని ఓ సవాల్‌గా తీసుకుని ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. అమరావతిలో విద్యా సంస్థను నెలకొల్పేందుకు ఎస్‌ఆర్‌ఎం ముందుకు రావాలని, స్థల కేటాయింపుతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని వెల్లడించారు. దీనిపై వర్సిటీ చాన్సలర్ పారివేందర్ పరిశీలిస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
చంద్రబాబుకు పటిష్ట భద్రత..
సీఎం చంద్రబాబునాయుడు చెన్నై పర్యటన నిఘా నీడలో సాగింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కల్పించిన తరహాలో చంద్రబాబుకు భద్రతా చర్యలు తీసుకున్నారు. అందుకు కారణం తమిళ ఎర్రచందనం కూలీలపై ఇటీవల తిరుపతిలో సాగిన ఎన్‌కౌంటర్‌పై తమిళ సంఘాలు ఆగ్రహంతో ఉండటమేనని ఓ అధికారి తెలిపారు.