చంద్రబాబు ఆస్తి రూ.177 కోట్లు...
-నారావారి చరాస్తులు రూ. 134 కోట్లు, స్థిరాస్తులు రూ. 43 కోట్లు
- రెండో స్థానంలో అరుణాచల్ సీఎం పెమాఖండు
-ఆయన ఆస్తి రూ.129 కోట్లు
-మూడో స్థానంలో తమిళనాడు సీఎం జయలలిత
-ఆమె ఆస్తి రూ. 113 కోట్లు
సాక్షి, అమరావతి: దేశంలో కోటీశ్వరులైన ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఎన్నికల సంస్కరణలతో పాటు వివిధ అంశాలపై అధ్యయనం చేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు గత సాధారణ ఎన్నికలకు ముందు అభ్యర్థులు అందచేసిన అఫిడవిట్‌లను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాయి. ఆ నివేదిక ప్రకారం చంద్రబాబు అత్యధిక ఆస్తులు కలిగిన సీఎంల జాబితాలో తొలి స్థానంలో, దేశంలోని అన్ని రాష్ట్రాల మంత్రులతో పోల్చితే.. నాలుగో స్థానంలో నిలిచారు.
అత్యధిక ఆస్తులు కలిగిన మంత్రుల జాబితాలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పంగూరు నారాయణ తొలిస్థానంలో నిలిచారు. ఏడీఆర్ సంస్థ నివేదిక ప్రకారం చంద్రబాబుకు 134 కోట్ల 80 లక్షల 11 వేల 728 రూపాయల చరాస్థులు, 42 కోట్ల 68 లక్షల 83 వేల 883 రూపాయల స్థిరాస్తులున్నాయి. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పెమాఖండుకు రూ. 129 కోట్ల 57 లక్షల 56 వేల 014 రూపాయలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు 113 కోట్ల 73 లక్షల 38 వేల 586 రూపాయల ఆస్తులున్నాయి. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న 20 మంత్రుల్లో 18 మంది కోటీశ్వరులే. ఏడీఆర్ సంస్థ ఈ నివేదికను ఆగస్టు తొలి వారంలో విడుదల చేసింది.
ప్రకటించేది మాత్రం రూ. లక్షల్లో
ఏటా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ నెలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. వెల్లడించే ఆస్తుల వివరాలకు.. అఫడవిట్ కు పొంతన లేదని ఈ రిపోర్టుతో తేలి పోయింది. గత కొద్ది ఏళ్లుగా ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ ఒక్కసారి కూడా అరకోటి దాటలేదు. కాగా.. 2014లో ఆయన ప్రకటించిన ఆస్తులు అంతకు ముందు ఏడాది కంటే.. తగ్గాయి కూడా.
చంద్రబాబు 1995 సెప్టెంబర్ నుంచి 2004 మే వరకూ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకు ముందు 1978లోనే ఆయన ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత తన ఎన్‌టీ రామారావు సీఎంగా ఉన్నపుడు కర్షక పరిషత్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అపుడే ఆయన పదవులు ఇప్పిస్తానని, పనులు చేసి పెడతానని పలువురి నుంచి లక్షల్లో వసూలు చేశారని తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయంగా తన పుస్తకంలో రాశారు.
చంద్రబాబు రెండెకరాల ఆసామి నుంచి రూ. రెండు వేల కోట్లు సంపాదించేంత స్థాయికి ఎదిగారని ఆయన తొలిసారి సీఎం అయిన తొలినాళ్లలోనే పత్రికలు ఘోషించాయి. ఐతే ఆయన మాత్రం అదంతా తూచ్ నా ఆస్తి లక్షల్లోనే, నా అంత నిజాయితీపరుడు ఈ దేశంలో లేరు అని ఏటా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్తుంటారు. ఈయన చెప్పే మాటల్లో నిజం లేదని తాజాగా ఏడీఆర్ సంస్థ వెల్లడించిన నివేదిక స్పష్టం చేస్తోంది.
2012లో....
చంద్రబాబు 2012 సెప్టెంబర్ రెండో వారంలో తన ఆస్తులను ప్రకటించారు. కుటుంబానికి ఉన్న అప్పులు పోగా ఆస్తులు రూ. 52.35 కోట్లు.
-చంద్రబాబు తన పేరిట ఆ ఏడాది ఆస్తులు రూ. 31.97 లక్షలుగా చూపారు. అప్పులు ఏమీ లేవని ప్రకటించారు. అదే సమయంలో అంతకు ముందు ఏడాది రూ. 39.88 లక్షలుగా ఉన్న ఆస్థి రూ. 31.97 లక్షలకు తగ్గిందని చెప్పారు.
-2012 సెప్టెంబర్‌లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆస్తి రూ. 41.74 కోట్లు, అప్పులు రూ. 17.21 కోట్లని చెప్పారు. ఆమె నికర ఆస్తి రూ. 24.52 కోట్లని వివరించారు. తన కుమారుడు లోకేష్ ఆస్తి రూ. 8.82 కోట్లు, ఆప్పులు రూ. 2.20 కోట్లు, నికర ఆస్తి రూ. 6.62 కోట్లుగా పేర్కొన్నారు. కోడ లు బ్రహ్మణి ఆస్తి రూ. 20. 9 కోట్లుగా, అప్పులు లేవని తెలిపారు.
-చంద్రబాబు కుటుంబం ఆస్తులు 2012 కంటే 2013కు రూ. 10 కోట్ల మేర పెరిగాయి. 2013 సెప్టెంబర్‌లో వెల్లడించే నాటికి చంద్రబాబు ఆస్తులు రూ. 42.06 లక్షలు, నారా భువనేశ్వరి రూ. 48.85 కోట్లు, లోకేష్ 9.73 కోట్లు, బ్రహ్మణి రూ. 3.3 కోట్లు.
-2014లో చంద్రబాబు ఆస్తి రూ. 70.69 లక్షలుగా ప్రకటించారు. భార్య భువనేశ్వరి పేరున రూ. 30 కోట్లు, లోకేష్ ఆస్తి రూ. 3.5 కోట్లు, బ్రహ్మణి ఆస్తి రూ. 90.71 లక్షలుగా పేర్కొన్నారు. ఇవన్నీ నికర ఆస్తులని వెల్లడించారు.
-2014లో ప్రకటించిన ఆస్తుల కంటే చంద్రబాబు ఆస్తులు 2015లో 40 శాతం తగ్గాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన తండ్రి ఆస్తులు తగ్గాయని లోకేష్ వెల్లడించారు. చంద్రబాబు ఆస్తి రూ 42.40 లక్షలు, తల్లి భువనేశ్వరి ఆస్తి రూ. 33.07 కోట్లు, తన ఆస్తి రూ. 7.67 కోట్లు, బ్రహ్మణి ఆస్తి రూ. 4.77 కోట్లని లోకేష్ వివరివచారు. 2014లో చంద్రబాబు ఆస్తి రూ. 70.69 లక్షలుగా ఉంది.