
ప్రసాదరావు నియామకానికి గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా బి.ప్రసాదరావు నియామకానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులను విడుదల చేయనుంది. ఏసీబీ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న ప్రసాదరావు.. సెప్టెంబర్ 30 నుంచి డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. డీజీపీ నియామకంపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఢిల్లీలో బుధవారం భేటీ అయింది.
ఐపీఎస్ 1979 బ్యాచ్‌కి చెందిన అరుణా బహుగుణ, టీపీ దాస్, బి.ప్రసాదరావు, ఎస్‌ఏ హుడా, 1981 బ్యాచ్‌కి చెందిన జేవీ రాముడు, ఏకే ఖాన్ పేర్లను డీజీపీ పదవికి యూపీఎస్సీ పరిశీలించింది. అరుణా బహుగుణ, దాస్, ప్రసాదరావుతో కూడిన ముగ్గురి ప్యానల్‌కు యూపీఎస్సీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి సీఎస్ పి.కె. మహంతి కూడా హాజరయ్యారు. ఈ ముగ్గురిలో ఒకర్ని డీజీపీగా నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీంతో ప్రసాదరావును డీజీపీగా నియమించడం లాంఛన ప్రాయమేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మరోసారి క్యాట్‌ను ఆశ్రయించిన దినేశ్ రెడ్డి
మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి మరోసారి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. డీజీపీగా తన పదవీ విరమణకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ, ఇన్‌చార్జి డీజీపీగా ప్రసాదరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దినేశ్‌రెడ్డి క్యాట్‌లో మరో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తనను రెండేళ్లపాటు డీజీపీ పదవిలో కొనసాగించాలంటూ దినేశ్‌రెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను సవరించేందుకు అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాది బుధవారం క్యాట్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషన్‌పై ధర్మాసనం స్పందిస్తూ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అయితే ప్రసాదరావు నియామకంపై అభ్యం తరం ఉంటే మరో పిటిషన్ దాఖలు చేసుకోవాలని.. ప్రస్తుత పిటిషన్‌లో ప్రసాదరావు ప్రతివాదిగా లేరని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శ్రీధర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో, ప్రసాదరావును ప్రతిపాదిగా చేరుస్తూ ఇంప్లీడ్ పిటిషన్ వేయాలంటూ ధర్మాసనం దినేశ్‌రెడ్డిని ఆదేశించింది.