కశ్మీర్‌లో అవి తగ్గుముఖం పట్టాయి..
లక్నో: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చొరవతో జమ్ము కశ్మీర్‌లో అల్లరి మూకల రాళ్ల దాడులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. గత మూడేళ్లుగా తీవ్రవాద, ఉగ్రవాద ఘటనలూ తగ్గాయని అన్నారు. దేశ భద్రతపై తాము కృతనిశ్చయంతో ఉన్నామని, అరాచక శక్తులపై కఠిన చర్యలు చేపడుతున్నామని అన్నారు.
గడిచిన మూడేళ్లలో ఈశాన్య భారతంలో తీవ్రవాదం 75 శాతం తగ్గిందని చెప్పారు. ఉగ్రవాదులు, అరాచక శక్తులకు నిధుల సరఫరా నిలిచిపోయేలా చేయడంతో పాటు నకిలీ కరెన్సీకి చెక్ పెడుతూ చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయని, దీనిలో ఎన్‌ఐఏ పాత్ర ప్రశంసనీయమని హోంమంత్రి పేర్కొన్నారు. విద్రోహుల ఆట కట్టించేందుకు ఎన్‌ఐఏ, రాష్ట్రాల ఏజెన్సీల మధ్య సమన్వయం అవసరమని చెప్పారు. ఎన్‌ఐఏ విశ్వసనీయ, ప్రతిష్టాత్మక దర్యాప్తు ఏజెన్సీగా పేరొందినని అన్నారు.