
'ఆప్'పడమేనా ?
అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీని స్థాపించడం ... ఆ వెంటనే దేశ రాజధాని హస్తినకు అసెంబ్లీకి ఎన్నికలు రావడం .... ఆ ఎన్నికల్లో 28 సీట్లు చీపురుతో లాగేసుకుని తన ఖాతాలో వేసుకుని కాంగ్రెస్ మద్దతుతో ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిష్టించడం... ఆ తర్వాత కేవలం 49 రోజులకే సీఎం పదవికి రాజీనామా చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే అనూహ్య పరిణామాలతో మళ్లీ ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తుందా లేకా 'అప్'పడమేనా అనేది ఓటర్లు తేల్చవలసి ఉంది.
కాగా గత ఎన్నిక సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పటికే ముచ్చటగా మూడుసార్లు సీఎం పీఠాన్ని అలంకరించిన షీలా దీక్షిత్పై కేజ్రీవాల్ పోటీ చేసి విజయం సాధించారు. దాంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ 31 స్థానాలు గెలుచుకున్నా అధికారం చేపట్టేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దాంతో కేవలం 8 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ పొత్తుతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదంతా గతం. అయితే ప్రస్తుత పరిస్థితులు వేరు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వరుసగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కమలం వికసించింది. కాషాయం అంతగా కనిపించని కాశ్మీర్లో కూడా ఆ పార్టీ అధిక సీట్లు గెలుచుకుని రెండవ స్థానంలో నిలిచింది. దాంతో దేశమంతా కాషాయమయం కావాలని కమలనాథులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు.
అంతేకాకుండా కమలదండు ఇప్పటికే దేశ రాజధాని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు దూసుకుపోతుంది. అందులో భాగంగా ఒకప్పటి కేజ్రీవాల్ సన్నిహితులుగా ముద్రపడిన కిరణ్ బేడీ, షాజియా ఇల్మీలు కమల తీర్థం పుచ్చుకున్నారు. ఆ క్రమంలో బీజేపీ మరింత బలం పుంజుకునే అవకాశాలున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గతంలో కంటే మరిన్నీ స్థానాలు గెలుచుకుని... చీపురుతో కమలాన్నీ ఊడ్చేస్తారా లేక కమల రేకుల కింద పడి 'ఆప్'పడమవుతుందా అనేది చూడాలి.