కొద్దిగా అంటే ... మొత్తం ఊడ్చేశాడు
దేశ రాజధాని హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్' విజయఢంకా మోగించడానికి తామే కారణమని కమలనాథులు తెగ ఫీలైపోతున్నారు. దేశ రాజధాని హస్తినలో కమలం వాడిపోయేందుకు ప్రధాని మోదీ నుంచి సాధారణ కార్యకర్త వరకు అందుకు పరోక్షంగా ప్రచారం చేశారని కలవరపడిపోతున్నారు.
గతేడాది అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధాని మోదీ క్లీన్ ఇండియా పేరుతో స్వచ్ఛా భారత్ కార్యక్రమాన్ని చీపురు పట్టుకుని ప్రారంభించడమేంటి... ఆ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖలందరిని భాగస్వాములు కావాలని పిలుపు నివ్వడమేంటి... ఆ జాబితాలో హస్తినలో సీఎం పగ్గాలు చేపట్టనున్న అరవింద్ కేజ్రీవాల్ను ఉండటమేంటి... ఆయన పార్టీ గుర్తు చీపురుతో కావడమేంటి... అంతా మాయా అని బీజేపీ సోదరులు వేదాంతం చెప్పుకుంటున్నారు.
ఓ విధంగా ఎన్నికల ముందే మోదీతోపాటు ఆయన కేబినెట్ సహచరులంతా న్యూఢిల్లీలోని వీధి వీధి నాదేనంటూ అంతా చీపుర్లు పట్టుకుని కలియదిరిగారు. దీంతో చీపురు ప్రచారం అంతా అరవిందుడికి కలసి వచ్చిందని అనుకుంటున్నారు. అదికాక స్వచ్ఛ్ భారత్లో పాల్గొని... కొద్దిగా ఊడ్చి పెట్టమని మోదీ చీపురు ఇస్తే... ఆ చీపురుతో పాటు తన 'చీపురు'తో కమలం పార్టీ రేకులు ఊడ్చిపారేశాడని హస్తినలోని కమలదళం బిక్క మోహం వేసింది.