పని ఒత్తిడి ఎక్కువై.. ముగ్గురిని చంపేశాడు!
భద్రతా దళాలకు పని ఒత్తిడి ఎక్కువ కావడం ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైంది. తమిళనాడులోని కల్పకం అణువిద్యుత్ కేంద్రంలో సీఐఎస్ఎఫ్ జవానుగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్ ప్రతాప్ సింగ్ బుధవారం తెల్లవారుజామున సహచరులపై కాల్పులు జరిపి ముగ్గురిని హతమార్చి, మరో ఇద్దరిని గాయపర్చిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని నరోరా అణు విద్యుత్ ప్లాంటు నుంచి ఇటీవలే అతడు కల్పకం ప్లాంటుకు బదిలీ మీద వచ్చాడు. ఇక్కడ పని ఒత్తిడి బాగా ఎక్కువ కావడం, దానికితోడు ఇంటికి దూరంగా ఉండటంతో భరించలేకపోయాడు.
బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలోకల్పకం టౌన్షిప్లో సీఐఎస్ఎఫ్ జవాన్లంతా రోల్ కాల్కు వెళ్తారు. మొత్తం 110 మంది జవాన్లు అక్కడకు చేరుకుంటారు. ఆ సమయంలో విజయ్ ప్రతాప్ సింగ్ ముందుగా ఆయుధాల స్టోర్స్కు వెళ్లి, అక్కడినుంచి 9 ఎంఎం స్టెన్ గన్, 60 బుల్లెట్లు తీసుకున్నాడు. ముందుగా బ్యారక్స్లోని మొదటి అంతస్థుకు చేరుకుని, అక్కడ సిబ్బందికి డ్యూటీలు వేసే మోహన్ సింగ్ అనే హెడ్ కానిస్టేబుల్ మీద కాల్పులు జరిపాడు. రాజస్థాన్కు చెందిన అతడు అక్కడికక్కడే మరణించాడు.
తర్వాత పోర్టికోలోకి వెళ్లి అక్కడ విధులకు హాజరవుతున్న బలగాలపై కాల్పులు జరిపాడు. దాంతో సేలంకు చెందిన ఏఎస్ఐ గణేశన్ (58), మదురైకి చెందిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు (54) కూడా మరణించారు. ఉత్తరాఖండ్కు చెందిన ఏఎస్ఐ ప్రతాప్ సింగ్, జమ్ము కాశ్మీర్కు చెందిన కానిస్టేబుల్ గోవర్ధన ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఎలాగోలా సహచరులు విజయ్ ప్రతాప్ సింగ్ను పట్టుకుని, ఒక గదిలో వేసి తాళం పెట్టారు. తర్వాత పోలీసులు అతడి మీద ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 307 (హత్యాయత్నం) కింద కేసులు పెట్టారు.