త్వరలో కఠిన నిర్ణయాలు: చిదంబరం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో వృధా ఖర్చులు తగ్గించడంతో పాటు, నిత్యావసరాలు కాని వస్తువుల దిగుమతి నిరోధానికి త్వరలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం తెలిపారు. శనివారం రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చను ఆర్థిక మంత్రి ముగించారు. ఒత్తిళ్లలో కొనసాగుతున్న ఆర్థికవ్యవస్థ దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నామని, తదుపరి కొన్ని రోజులు, వారాల్లో మరిన్ని చర్యలు ప్రకటిస్తామని చెప్పారు. ఈ చర్యలు ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలను అరికట్టేందుకు కూడా ప్రభుత్వం మరిన్ని చ ర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ‘నిరాశాజనకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు వృధా వ్యయానికి కళ్లెం వేయాలి.. వీటిని పొదుపు చర్యలని మీరనవచ్చు.. లేదా ప్రణాళికేతర వ్యయంలో కోత అనవచ్చు..’ అని చిదంబరం అన్నారు. ఇంధన ధరలపై సభ్యుల ఆందోళనను ప్రస్తావిస్తూ.. డీజిల్, పెట్రోల్ ధరల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి దుందుడుకు నిర్ణయమూ తీసుకోబోదని హామీ ఇచ్చారు. రూపాయి పతనంపై మాట్లాడుతూ.. కొన్నిరోజులుగా పరిస్థితి కొంత మెరుగుపడటాన్ని ఆయన ప్రస్తావించారు. కరెన్సీ మార్కెట్లలో ఎన్నో అదృశ్య అంశాలపై మన ం పోరాడుతున్నామని చిదంబరం వ్యాఖ్యానించారు.
ఏపీలో పరిస్థితి కేంద్రం అదుపులోనే ఉంది
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి కేంద్రం అదుపులోనే ఉందని, రాష్ట్రానికి చెందిన ఎంపీలు కాస్త ఓపికతో ఉండాలని కేంద్రం సూచించింది. సమైక్యాంధ్ర మద్దతుదారులు చేపట్టిన 24 గంటల బంద్ నేపథ్యంలో శనివారం రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యులు రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ నిర్ణయం ప్రకటించినప్పటి నుంచీ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందని, దీనిని చక్కదిద్దేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేమిటని రాష్ట్రానికి చెందిన పలువురు సభ్యులు ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్రానికి చెందిన కొందరు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కురియన్ అనుమతించలేదు.
ఈ అంశంపై ఒత్తిడి తేవద్దని కాంగ్రెస్ సీనియర్ సభ్యులు కూడా వారికి నచ్చచెప్పడంతో వారు మిన్నకుండిపోయారు. ఆర్థిక మంత్రి చిదంబరం ఈ అంశంపై మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన సభ్యుల ఆందోళనను తాను అర్థం చేసుకోగలనని, అయితే పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు సాగిస్తున్నామని, శాంతిభద్రతలు కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. అయితే రాష్ట్రంలో పరిస్థితిపై రాజ్యసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా శనివారం తెలుగుదేశం ఎంపీలు సి.ఎం.రమేష్, సుజనా చౌదరి వాకౌట్ చేశారు. హైదరాబాద్‌లో అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని సీ ఎం రమేష్ అన్నారు.