మొగ్గలోనే తుంచేద్దాం | Students keep in control | Sakshi
Sakshi News home page

మొగ్గలోనే తుంచేద్దాం

Published Mon, Sep 28 2015 9:18 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

మొగ్గలోనే తుంచేద్దాం - Sakshi

మొగ్గలోనే తుంచేద్దాం

- విద్యార్థులను అదుపులో పెట్టుకోండి
- యూనివర్సిటీలు, కాలేజీలకు ప్రభుత్వం ఆదేశాలు
- ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక యువతలో పెల్లుబుకుతున్న అశాంతి
- నిరసనలను అడ్డుకోవటం.. ‘ప్రత్యేక హోదా’ ఉద్యమాల అణచివేతకు సర్కారు వ్యూహం
- వర్సిటీల్లో ఎన్నడూలేని విధంగా నియంత్రణ
- ప్రభుత్వంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం


సాక్షి, హైదరాబాద్:
నిరుద్యోగ యువకులు, విద్యార్థుల్లో పెల్లుబుకుతున్న నిరసనలు, ప్రత్యేక హోదా సాధన కోసం వేడెక్కుతున్న ఉద్యమాలను మొగ్గలోనే తుంచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా సమస్యలపై జరిగే ఆందోళనలు, నిరసన దీక్షల్లో విద్యార్థులు భాగస్వామ్యం కాకుండా కట్టడి చేయడానికి సిద్ధమైంది. విద్యా ప్రమాణాల్లో నాణ్యత పేరుతో విశ్వవిద్యాలయాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను ఎక్కడికక్కడ నియంత్రించాలని నిర్ణయించింది. తాజాగా ఉన్నత విద్యా మండలి ఆయా యూనివర్సిటీలకు, కాలేజీలకు జారీ చేసిన లేఖల్లో (డీవో లెటర్ నంబర్-ఏపీఎస్‌సీహెచ్‌ఈ/యూనివర్సిటీ/అఫిలియేటెట్ కాలేజెస్/2015) పేరుతో ఈ నెల 25న జారీ చేసిన సర్క్యులర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందులో విద్యార్థులు-క్రమశిక్షణను ఒక ఎజెండాగా చేసింది.

యూనివర్సిటీల స్థాయిలో విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడంపై తీసుకోవలసిన చర్యలను ఎజెండాగా చేర్చి దానిపై అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్, మేనేజ్‌మెంట్లు మానవ వనరుల శాఖ మంత్రికి నివేదికలు ఇవ్వాలని, చర్యా నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విద్యార్థులు రోడ్డెక్కకుండా కట్టడి చేయాలన్న సుదూర లక్ష్యంతోనే ఇలాంటి ఆదేశాలు జారీ చేసినట్టు స్పష్టమవుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడానికి కీలకమైన ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రతరం అవుతుండటం, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలి కాలంలో తిరుపతి, విశాఖల్లో నిర్వహించిన యువభేరి సదస్సులో పాల్గొని ప్రత్యేకహోదా సాధించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించడం, అక్టోబర్ 7 నుంచి ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టబోతున్న తరుణంలో విద్యార్థులను ఈ రకంగా నియంత్రించబోతున్నట్టు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఉత్తర్వులపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పైగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.
 
నియంత్రించడమే లక్ష్యంగా..
ఇటీవల తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, విశాఖలో ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థులు నిర్వహించిన సదస్సులో ప్రతిపక్ష నేత జగన్ పాల్గొని ప్రసంగించడాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వం క్రమశిక్షణ పేరుతో ఈ కొత్త ఎత్తుగడ వేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యువభేరి సదస్సులు నిర్వహిస్తున్నారని తెలియగానే వర్సిటీల్లో ఇలాంటి సమావేశాలేంటంటూ అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. తద్వారా విద్యార్థులు పాల్గొనకుండా చేయాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. పైగా ఆ సదస్సులకు అనూహ్యంగా వేలాది మంది విద్యార్థులు హాజరుకావడంతో విజయవంతమయ్యాయి.

ఇదే క్రమంలో విశాఖ సదస్సుకు హాజరైన వర్సిటీ అధ్యాపకులపైన ప్రభుత్వం క్రమశిక్షణ పేరుతో చర్యలకు ఉపక్రమించింది. తాజాగా ప్రత్యేకహోదా సాధన కోసం జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించగానే అనుమతించకుండా రకరకాల అడ్డంకులు సృష్టించింది. మరోవైపు ప్రత్యేకహోదా సాధిస్తే తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని విద్యార్థి లోకం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో జరిగే ప్రతి పోరాటంలోనూ భాగస్వామ్యం కావడానికి విద్యార్థులు, యువకులు ఉద్యుక్తులవుతున్న తరుణంలో రాష్ట్రంలోని వర్సిటీలు, కాలేజీల పరిస్థితులపై మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులతో సమీక్షించారు.

ఆయా వర్సిటీలు, కాలేజీల్లోని సమస్యలు, విద్యార్థులకు సంబంధించిన అంశాలను ఆరా తీసి పలు సూచనలు జారీచేశారు. మంత్రి సమీక్ష అనంతరం ఆయన చేసిన సూచనల మేరకు వర్సిటీలు, కాలేజీలు చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి లేఖ పంపింది. నివారణ చర్యలకు సూచనలు చేసింది. వర్సిటీలు తమ పరిధిలోని అఫ్లియేటెడ్ కాలేజీల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలతో వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాల్సిన అంశాలను ఆ లేఖలో సూచించింది. దీనిలో మొదటి అంశంగా విద్యార్థుల క్రమశిక్షణను ఉంచడం విశేషం. తదుపరి అంశాలుగా ర్యాగింగ్ వ్యతిరేక నిరోధక చర్యలు, కొత్త సిలబస్ తదనంతర పరిస్థితులు, మాల్‌ప్రాక్టీసు లేకుండా పరీక్షల నిర్వహణ, బకాయిల వసూళ్లపై చర్చించాలని సూచించింది. బోధన, బోధనేతర సిబ్బంది పనితీరును సమీక్షించడంతోపాటు వీటన్నింటిపైనా చర్యా నివేదికలను సమర్పించాలని ఉన్నత విద్యామండలి లేఖల్లో ఆదేశించింది.
 
ఏడాదిన్నర గడుస్తున్నా..
ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నర గడుస్తున్నా ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. ఉద్యోగం కల్పించకుంటే నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పి ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం పలు నిబంధనలు విధించడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ వేలాదిమందికి అందకుండా పోతోంది. ఇప్పటికే చదువుతున్న వారికి ఫీజుల బకాయిలు నిలిచిపోగా వాటిని చెల్లించాలంటూ విద్యార్థులపై కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి.

మరోవైపు ర్యాగింగ్ వేధింపులు, ప్రైవేటు సంస్థల్లో చదువుల ఒత్తిళ్లతో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వీటన్నిటితో విద్యార్థుల్లో అశాంతి, ఆందోళన రోజురోజుకూ ఎక్కువవుతోంది. వీటిని ఎక్కడికక్కడ కట్టడి చే యకపోతే భవిష్యత్తులో ఆందోళనలు, ఉద్యమాలు తీవ్రమవుతాయని ప్రభుత్వం అంచనాకొచ్చింది. అందుకే వాటిని అదుపుచేసేలా, అన్ని విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని వర్సిటీలకు ఆదేశాలు జారీచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement