టీమిండియా గెలుపు వెనుక కీలక కారణాలివే!
బెంగళూరు టెస్టు దాదాపు థ్రిల్లర్ మూవీని తలపించింది. మొదట బ్యాటింగ్‌లో చిత్తయి.. ఆ తర్వాత బౌలింగ్‌లో అంతంతమాత్రం రాణించి.. రెండో టెస్టులో చాలావరకు ఆత్మరక్షణలో ఆడిన కోహ్లి సేన నాలుగో రోజు జూలు విదిల్చింది. ఎవరూ ఊహించనిరీతిలో అందరిని విస్మయపరుస్తూ ఆస్ట్రేలియాపై 75పరుగుల సంచలన విజయాన్ని నమోదుచేసింది. ఈ విజయంతో కోహ్లి సేనలో ఆత్మవిశ్వాసం ఇనుమడించడమే కాదు.. సిరీస్ 1-1తో సమం అయింది.
నిజానికి నాలుగో రోజు టీమిండియాకు ప్రారంభంలో కొంత నిరాశే ఎదురైంది. మూడో రోజు 126 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన కోహ్లి సేన భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందు ఉంచాలనుకుంది. కానీ కేవలం 61 పరుగులు మాత్రమే జోడించి చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో 188 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని నిలబెట్టుకోవాలంటే.. అసామాన్య ప్రతిభను చూపించాల్సిన తరుణంలో కోహ్లి సేన అదే చేసి చూపెట్టింది. బౌలింగ్ విభాగం వీరోచితమైన ప్రతిభను ప్రదర్శించింది. సమిష్టి కృషితో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు వెనుక కీలక కారణాలను విశ్లేషించుకుంటే..
ముందుండి నడిపించిన ఇషాంత్!
188 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఆరంభంలోనే ఓపెనర్లను వీడదీయాలి. ఒత్తిడి పెంచాలి. ఓపెనర్లు శుభారంభం ఇవ్వకుండా అడ్డుకోవాలి. సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ అదే చేశాడు. పెద్దగా పోరాటపటిమ చూపకుండా నిరాశ పరుస్తూ వచ్చిన ఇషాంత్ మంగళవారం మాత్రం సత్తా చాటాడు. ఆస్ట్రేలియా ఓపెనర్లు కుదురుకోకముందే పెమిలియన్ దారి పట్టించాడు. ముఖ్యంగా కీలకమైన మాత్ రెన్‌షా వికెట్‌ను ఇషాంత్ పడగొట్టాడు. ప్రస్తుత సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలు సాధించి.. ఆసిస్ జట్టుకు మంచి ఓపెనింగ్స్‌ను ఇస్తున్న రెన్‌షాను త్వరగా ఔట్ చేయడం టీమిండియాకు కలిసి వచ్చింది.
ఫీల్డర్లు తడబడలేదు!
క్లోజ్ ఇన్ లో ఉన్న భారత ఫీల్డర్లు దారుణంగా క్యాచ్‌లు వదిలేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా పుణె టెస్టులో అయితే టీమిండియా లెక్కలెనన్ని క్యాచ్‌లు వదిలేసింది. దీంతో ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు మూడుసార్లు లైఫ్‌లైన్ లభించింది. దీంతో అతడు చెలరేగిపోయి.. భారత్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచడంలో సఫలమయ్యాడు. కానీ, బెంగళూరు టెస్టులో మాత్రం అందుకు టీమిండియా ఫీల్డర్లు తావు ఇవ్వలేదు. చక్కగా ఫీల్డింగ్ చేశారు. క్యాచ్‌లు అందుకున్నారు. అశ్విన్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ బ్యాటుకు తాకిన బంతిని ఇన్‌సైడ్ ఎడ్జ్‌ళో అందుకునేందుకు వృద్ధిమాన్ సాహా వేసిన డైవింగ్.. మ్యాచ్‌లో మనవారి ఫీల్డింగ్ ప్రతిభకు మచ్చుతునకగా చెప్పవచ్చు.
వారెవ్వా అశ్విన్!
ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అశ్విన్ పెద్దగా రాణించలేదు. ఆస్ట్రేలియా బ్యాట్‌మెన్‌ను అవుట్ చేయడంలో తంటాలు పడ్డాడు. బెంగళూరులో సెకండ్ ఇన్నింగ్స్ వరకు అతని మ్యాజిక్ పెద్దగా పనిచేయలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఐసీసీ నెంబర్ 1 టెస్టు బౌలర్ తన సత్తా ఏమిటో చాటాడు. అవసరమైన సమయంలో అద్భుతంగా పుంజుకొని ఆసిస్ జట్టు ఆరు వికెట్లు నేలకూల్చాడు. దీంతో భారత్‌కు 75 పరుగుల భారీ విజయం సొంతమైంది.