12వారాల్లో ఆ రైతులకు భూములు వాపస్!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో పెనురాజకీయ దుమారం సృష్టించిన టాటా నానో ఫ్యాక్టరీకి భూముల కేటాయింపు వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సింగూర్‌లో నానో ఫ్యాక్టరీకి వెయ్యి ఎకరాల వ్యవసాయ భూమి కేటాయిస్తూ చేసుకున్న ఒప్పందాన్ని కొట్టివేసింది. భూములు కోల్పోయిన బాధిత రైతులకు 12వారాల్లోగా వారి భూములు వారికి తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది.
2006లో బెంగాల్‌లోని అప్పటి వామపక్ష ప్రభుత్వం టాటా మోటార్స్‌కు వెయ్యి ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, వ్యవసాయ భూములను కంపెనీకి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరి అయిన లెఫ్ట్ సర్కార్ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న మమతా బెనర్జీ అధికార పీఠాన్ని చేపట్టి ఇప్పటివరకు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నానో ప్లాంటు బెంగాల్ నుంచి గుజరాత్‌కు తరలిపోయింది.
తీర్పు సందర్భంగా అప్పటి లెఫ్ట్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చట్టంలో లోపాల వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించింది. కచ్చితంగా రాష్ట్రంలోకి ఈ ప్రాజెక్టు రావాలని లెఫ్ట్ ప్రభుత్వం మంకుపట్టు పట్టినట్టు కనిపిస్తున్నదని, ప్రైవేటు కంపెనీ సూచన మేరకు నచ్చినచోట భూముల సేకరణ చేపట్టడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పుతో సింగూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ వీధుల్లో పటాకులు కాలుస్తూ సంబురాలు జరుపుకొన్నారు.