జల్లికట్టుపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం
న్యూఢిల్లీ: వివాదాస్పద జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు బుధవారం మరో నిర్ణయాన్ని వెల్లడించింది. జల్లికట్టును పునరుద్ధరిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని, ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి చట్టంగా రూపొందించచడాన్ని సవాలు చేస్తూ జంతు సంక్షమ బోర్డు(ఆనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా- ఏడబ్ల్యూబీఐ) సహా ఇతర సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరిచింది.
‘జనవరి 30న (సోమవారం) ఏడబ్ల్యూబీఐ, ఇతర సంస్థలు వేసిన అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తాం’అని సుప్రీం ధర్మాసనం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జల్లికట్టు పేరుతో జంతువులను యధేచ్ఛగా హింసిస్తున్నారంటూ అంతర్జాతీయ జంతు కారుణ్య సంస్థ పెటా వ్యక్తం చేసిన వాదనను సమర్థించిన కోర్టు.. గత ఏడాది చివర్లో సంప్రదాయ క్రీడను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే జల్లికట్టు సంక్రాతి(పొంగల్) సందర్భంగా నిర్వహించే క్రీడ కావడంతో పండుగ వేళ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. మెరీనా బీచ్ వేదికగా గతవారం భారీ నిరసనలు చోటుచేసుకున్నాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం హుటాహుటిన ఆర్డినెన్స్ జారీచేసింది. మరునాడే అసెంబ్లీలో జల్లికట్టుకు అనుకూలంగా తీర్మానం చేసింది.
ఆర్డినెన్స్‌కు చుక్కెదురవుతుందా?
జల్లికట్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తుందనే అనుమానాల నేపథ్యంలో సుప్రంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టుపై తమిళ సర్కారు జారీచేసిన ఆర్డినెన్స్ తాత్కలికమైనదేఅయినా, శాసన సభ ఆమోదంతో అది చట్టంగా మారిందని కట్జూ గుర్తుచేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులును సుప్రీంకోర్టులో సవాలుచేసే అవకాశం ఉన్నప్పటికీ, రాజ్యాంగంలోని అధికరణ 254(2) ప్రకారం జల్లికట్టు బిల్లుకు రక్షణ లభిస్తుందని, కాబట్టి జల్లికట్టు అభిమానులు భయపడాల్సిన అవసరం లేదని కట్జూ వ్యాఖ్యానించారు.