రేప్ బాధితురాలి అబార్షన్కు సుప్రీం ఓకే
అత్యాచార బాధితురాలికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చే తీర్పునిచ్చింది. గర్భంలో ఉన్న శిశువు పరిస్థితి బాగోకపోవడంతో 24 వారాల గర్భాన్ని కూడా తీయించుకోడానికి ఆమెకు అనుమతినిచ్చింది. దీనిపై ముంబైకి చెందిన ఆస్పత్రి మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికను ప్రాతిపదికగా తీసుకున్న సుప్రీంకోర్టు.. గర్భాన్ని కొనసాగిస్తే తల్లి ప్రాణాలకు ముప్పుందని భావించి.. అబార్షన్కు అనుమతించింది. గర్భంలో ఉన్న శిశువుకు కపాలం లేదని, కాలేయంతో పాటు పేవులు కూడా శరీరం వెలుపల పెరుగుతున్నాయని వైద్యుల బృందం తెలిపింది. పుట్టేవరకు కూడా ఆ గర్భస్థ శిశువు బతికే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. వాస్తవానికి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్నీ యాక్ట్ 1971 లోని సెక్షన్ 3 ప్రకారం అత్యాచార బాధితురాలు గర్భస్రావం చేయించుకోవచ్చు. అయితే ఈ చట్టం ప్రకారం 12 వారాల నుంచి 20 వారాల మధ్య గర్భాన్ని తొలగించుకోవచ్చు. కానీ ఈ కేసులో మాత్రం ఆ సెక్షన్ వర్తించబోదని, తల్లి ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు. గర్భస్థ పిండాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే కారణంతోనే 20 వారాల సీలింగ్ పెట్టారని ఆయన గుర్తుచేశారు.
పెళ్లి చేసుకుంటానని చెప్పిన వ్యక్తి తనను మోసం చేసి తల్లిని చేశాడని, తర్వాత పెళ్లి చేసుకోలేదని బాధితురాలు తన పిటిషన్లో పేర్కొంది. అసలు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్నీ చట్టం 1971లోని 20 వారాల సీలింగ్ సెక్షన్నే రద్దుచేయాలని ఆమె సుప్రీంకోర్టును కోరింది. ఆమె ఆరోగ్య పరిస్థితి, గర్భస్థ శిశువు ఆరోగ్యం ఎలా ఉందో పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం వైద్యులను ఆదేశించింది. వాళ్ల నివేదిక అనంతరం దాంతో ఏకీభవించిన కోర్టు.. ఆమె అబార్షన్ చేయించుకోడానికి అనుమతించింది.