అరుదైన కేసులో సుప్రీం తీర్పు
అరుదైన కేసులో సుప్రీం తీర్పు
Published Fri, Aug 18 2017 12:32 PM | Last Updated on Thu, Jul 18 2019 2:21 PM
న్యూఢిల్లీ: భాతర దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం ఓ అరుదైన కేసులో తీర్పును వెలువరించింది. రేప్ బాధితురాలి అబార్షన్‌కు అలసత్వం ప్రదర్శించారంటూ బిహార్ ప్రభుత్వానికి 10 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని ఆమెకు చెల్లించాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ఈ తరహా తీర్పు ఇదే మొదటిసారి కావటం విశేషం.
భర్త నుంచి విడాకులు తీసుకుని వీధిపాలైన 35 ఏళ్ల మహిళ పాట్నా వీధుల్లో తిరుగుతూ జీవనం కొనసాగిస్తోంది. ఆ సమయంలో కొందరు కామాంధులు ఆమెపై అత్యాచారం చేశారు. దీన స్థితిలో ఉన్న ఆమెను ఈ జనవరిలో ఓ స్వచ్ఛంధ సంస్థ అక్కున చేర్చుకుంది. అయితే వైద్యపరీక్షల్లో ఆమెకు హెచ్‌ఐవీతోపాటు గర్భవతి అని కూడా తేలింది. దీంతో పుట్టే బిడ్డకు కూడా సోకే ప్రమాదం ఉండటంతో గర్భం తీసేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి విజ్నప్తి చేసింది.
ఆస్పత్రి వర్గాలు అలసత్వం ప్రదర్శించటంతో ఆమె పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ కూడా జాప్యం కావటంతో చివరకు ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటికే 26 వారాల గర్భవతి కావటంతో ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని వైద్యులు తేల్చేయటంతో సుప్రీం అబార్షన్ కు నిరాకరించింది. (చట్టం ప్రకారం ఇలాంటి కేసుల్లో 20 వారాల గర్భవతి అబార్షన్ కు మాత్రమే కోర్టులు అనుమతిస్తాయి.). పూర్తి విచారణ ముగిసిన అనంతరం 10 లక్షల నష్టపరిహారంతోపాటు అత్యాచార బాధితుల సంక్షేమ నిధి నుంచి మరో 3లక్షలు ఆమెకు చెల్లించాలని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఖాన్‌విల్కర్‌లు బిహార్ సర్కార్‌ను ఆదేశించారు.
Advertisement
Advertisement