కేజ్రీవాల్ ధర్నా ఘటనపై సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధర్నాకు దిగిన సంఘటనపై కు సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. రాజ్యంగబద్ధమైన హోదాలో ఉండి చట్టాన్ని అతిక్రమించిన కేజ్రీవాల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఎంఎల్ శర్మ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజిత వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. జస్టిస్ ఆర్ ఎమ్ లోథా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. చట్టాలను రూపొందించాల్సిన వారే చట్టాలను ఉల్లంఘించరాదంటూ శర్మ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. కేంద్రానికి హోం శాఖ కార్యదర్శి ద్వారా నోటీసులు పంపించింది.
ఢిల్లీ పోలీసులను ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకి తేవాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని నడిబొడ్డున అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇద్దరు పోలీస్ అధికారుల్ని కేంద్రం బదిలీ చేయడంతో వివాదం సద్దుమణిగింది.