కొన్నింటిపై వివక్ష ఏల?
* ఇంజనీరింగ్ కాలేజీలపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం సూటి ప్రశ్న
* అందరికీ సమానావకాశం కోసమే ఎంసెట్ గడువు పెంచాం
* ఆ దిశగా ఏం చేశారో చెప్పండి?
* కాలేజీల విన్నపంపైనా కౌంటర్ దాఖలు చేయండి
* జేఎన్టీయూహెచ్‌ను, సర్కారును ఆదేశించిన ధర్మాసనం
* విచారణ 27కు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని కాలేజీలపై ఎందుకు వివక్ష చూపుతున్నారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అందరికీ సమాన అవకాశాలు దక్కాలనే గతంలో కౌన్సెలింగ్ గడువును పొడిగించినట్టు గుర్తుచేసింది. అందరికీ అవకాశాలు కల్పించడంలో భాగంగా కౌన్సెలింగ్ ప్రక్రియను ఏ విధంగా నిర్వహించారో తెలియజేస్తూ ఈ నెల 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు తమకు అవకాశం ఇవ్వలేదంటూ పలు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు, మలివిడత కౌన్సెలింగ్ కోరుతూ కొందరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. జస్టిస్ సుధాంశు జ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం ఎదుట వాదోపవాదాలు జరిగాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల కోసం ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రమాణాలు లేని కారణంగా 174 ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూహెచ్ అనుమతులు లభించని సంగతి తెలిసిందే. దీనిపై దాదాపు 32 కాలేజీలు సుప్రీంని ఆశ్రయించాయి.
తాజాగా జరిగిన విచారణలో తొలుత పిటిషనర్ల తరఫున న్యాయవాది గోపాల సుబ్రమణ్యం వాదనలు వినిపించారు. 20 ఏళ్లుగా యూనివర్సిటీ, ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న కాలేజీలను కూడా కౌన్సెలింగ్‌లో పాల్గొనకుండా చేశారని పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ ముఖోపాధ్యాయ జోక్యం చేసుకుని.. చట్ట ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించాలని చెప్పామని పేర్కొన్నారు. ‘కొన్ని కాలేజీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? మేం కౌన్సెలింగ్ గడువును ఆగస్టు 31 వరకు ఎందుకు పొడిగించాం. అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే కదా గడువు పెంచాం. దానర్థం కొన్ని కళాశాలలపై వివక్ష చూపాలని కాదే’ అంటూ తెలంగాణ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు.
ఈ సందర్భంగా జేఏన్టీయూహెచ్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించబోతుండగా న్యాయమూర్తి మరోసారి కల్పించుకుని... ‘తొలుత అఫిడవిట్ దాఖలు చేయనివ్వండి.. ఎందుకు అవకాశం కల్పించలేదో చెప్పనివ్వండి’ అని పేర్కొన్నారు. అందరికీ అవకాశం కల్పించడంలో భాగంగా యూనివర్సిటీ, తెలంగాణ ప్రభుత్వం రెండూ ఏం చేశాయో అఫిడవిట్ దాఖలు చేయాలని, అలాగే కాలేజీల ప్రస్తుత విన్నపంపైనా ఈ నెల 17లోగా కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను 27వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.