
జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన!
- పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు.. వచ్చేవారం వాదనలు
న్యూఢిల్లీ: హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనలు ఇంకా చల్లారలేదు. గడిచిన 15 రోజులుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. కర్ఫ్యూ ప్రాంతాల్లో ప్రజలకు రేషన్ సరుకులు అందించాలని కేంద్రం.. మొహబూబా సర్కారును కోరినప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలేవీ సాగడంలేదు. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది.
జమ్ముకశ్మీర్ లో భద్రతా బలగాల హెచ్చుమీరి ప్రవర్తిస్తున్నాయని, నిరంకుశంగా ప్రజలను అణచివేస్తున్నాయని, వాటిని అరకట్టేందుకు జమ్ముకశ్మీర్ రాజ్యాంగం సెక్షన్ 92ను అనుసరించి రాష్ట్రంలో రాష్రపతి పాలన విధించాలని జమ్ముకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (జేకేఎన్పీపీ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసం శుక్రవారం ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. వచ్చేవారం వాదనలు జరగనున్నాయి. గడిచిన రెండు వారాలుగా రాష్ట్రంలో కొనసాగుతోన్న ఆందోళనలను అదుపుచేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న పిటిషనర్లు.. ముఫ్తీ సర్కారును రద్దుచేసేలా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టును కోరారు.
కాగా, పరిష్కారం కోసం హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు? అని ధర్మాసనం ప్రశ్నించగా, కొద్దిరోజులుగా జమ్ముకశ్మీర్ హైకోర్టులో కార్యకలాపాలు స్తంభించిన సంగతిని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం కశ్వీర్ లోయలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనల్లో 45 మంది పౌరులు మరణించిన సంగతి తెలిసిందే.