పాక్, నల్లధనం.. మూడో సర్జికల్ స్ట్రయిక్ దీనిపైనే!
పాక్, నల్లధనం.. మూడో సర్జికల్ స్ట్రయిక్ దీనిపైనే!
Published Thu, Nov 10 2016 7:54 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM
ఇప్పటికే మాట వినని పాకిస్థాన్‌పై, దేశంలో మూలుగుతున్న నల్లధనంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్జికల్ స్ట్రైకులు జరిపారు. వీటి తర్వాత ఇక సర్జికల్ స్ట్రైక్స్ జరపాల్సింది క్రీడారంగంపైనే అంటున్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తెలుగు షట్లర్ పీవీ సంధును సత్కరించిన సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని స్పోర్ట్స్ అసోసియేషన్లను ప్రక్షాళన చేయడానికి సర్జికల్ స్ట్రైక్స్ జరపాల్సిన అవసరముందని పేర్కొన్నారు. క్రీడలతో అనుబంధమున్న వారే క్రీడా పరిపాలక సంస్థల్లో ఉండాలని ఆయన తేల్చిచెప్పారు.
నిజానికి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఇదే విషయమై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బీజేపీ జాతీయ కార్యదర్శి అయిన కైలాశ్ విజయ్‌వార్గియా కూడా ఇండోర్ డివిజన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పలువురు బీజేపీ నేతలు కూడా స్పోర్ట్స్ బాడీల్లో పనిచేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న నేతలు ఇలా క్రీడలతో అంటకాగి భ్రష్టుపట్టిస్తుండటంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షలు పీవీ సింధుకు సీఎం చౌహాన్ బహూకరించారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి పీవీ సింధు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement