'ఇండో-పాక్' పెళ్లికి శుభం కార్డు!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ అమ్మాయి.. ఇండియా అబ్బాయి.. త్వరలో పెళ్లి.. ఇంతలోనే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత.. ఈ కారణంగా పెళ్లి బృందానికి వీసా నిరాకరణ.. దిక్కుతోచని స్థితిలో.. సహాయం చేయాల్సిందిగా ఆ యువకుడు దేశప్రధానికి, విదేశీవ్యవహారాల మంత్రికి గోడు విన్నవించుకున్నాడు. చివరికేం జరిగిందంటే..
జోథ్ పూర్(రాజస్థాన్) కు చెందిన నరేశ్ తేవానీకి కరాచీ(పాకిస్థాన్)కు చెందిన ప్రియా బచ్చానికి రెండేళ్ల కిందట పెళ్లి కుదిరింది. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన ఈ జంట 2014లో నిశ్చితార్థం జరుపుకొంది. అప్పటి పరిస్థితుల్లో పెళ్లి కూతురు, ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి ఆటంకాలు లేకుండానే ఇండియాకు వచ్చి వెళ్లారు. కానీ పెళ్లికి మాత్రం సవాలక్ష అడ్డంకులేర్పడ్డాయి. నరేశ్, ప్రియల వివాహం నవంబర్ 7న జోధ్ పూర్ లో జరగాల్సిఉంది.
ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కరాచీలోని ఇండియన్ ఎంబసీ.. ప్రియాకు, ఆమె బంధువులకు వీసా నిరాకరించింది. దీంతో పెళ్లి ఆగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం చెయ్యాలో పాలుపోని వరుడు నరేశ్ తన గోడునంతా.. ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్విట్టర్ ద్వారా చేరవేశాడు. ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి సుష్మా.. 'డోన్ట్ వరీ.. వీసా సమస్యను పరిష్కరిస్తాం..'అని నరేశ్ కు భరోసా ఇచ్చారు. ఇంకేముంది.. అతి త్వరలోనే ఈ ఇండోపాక్ ప్రేమపెళ్లికి శుభంకార్డు పడ్డట్టే! (పాక్ యువతకు మరింత దగ్గరైన సుష్మా)
आप चिंता न करें. हम वीज़ा दिलवा देंगे. Pl do not worry. We will issue the Visa. pic.twitter.com/yubcZXcQKG https://t.co/8jUPo6VUvi
— Sushma Swaraj (@SushmaSwaraj) 7 October 2016