'కుటుంబంపై కాల్పులు జరిపి...తానూ ఆత్మహత్య'
ఛత్తీస్గఢ్ : కుటుంబసభ్యులపై కాల్పులు జరిపి అనంతరం ఓ పోలీసు ఉన్నత అధికారి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈరోజు తెల్లవారుజామున ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. సస్పెండ్ అయిన జగదల్పూర్ ఎస్పీ దేవ్ నారాయణ్ పాటిల్ కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపి ఆ తర్వాత తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ సంఘటనలో ఎస్పీ, ఆయన భార్య ప్రతిమా మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ఆర్యన్ (6), పూజ (11) ప్రాణాలతో బయటపడ్డారు.
అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ చిన్నారులు రాయ్పూర్లోని రామకృష్ణ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న విధులు నుంచి సస్పెండ్ కావటంతో మనస్తాపం చెందిన దేవ్ నారాయణ ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి లేఖ లభించలేదని బస్తర్ రేంజ్ ఐజీ అరుణ్ దేవ్ గౌతమ్ తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరుతామని ఆయన పేర్కొన్నారు.