ప్రతిపక్షంపై వేటు | suspension on opposition about AP assembly sessions | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షంపై వేటు

Published Tue, Oct 6 2015 3:26 AM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

ప్రతిపక్షంపై వేటు - Sakshi

ప్రతిపక్షంపై వేటు

శాసనసభ, మండలి నుంచి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, వైఎస్సార్‌సీపీ సభ్యుల సస్పెన్షన్
సమావేశాలు ముగిసే వరకు వర్తింపు.. మార్షల్స్ సాయంతో బయటకు..
అసెంబ్లీలో 29 మంది, మండలిలో ఆరుగురిపై ప్రభుత్వం వేటు
ప్రతిపక్షనేత జానారెడ్డి, గీతారెడ్డి, ఆర్.కృష్ణయ్యలకు మినహాయింపు
ఏకమొత్తంగా రుణమాఫీ చేయాలంటూ అసెంబ్లీని స్తంభింపజేసిన విపక్షాలు
రైతుల ఆత్మహత్యలను నిలువరించాలి, ఆదుకోవాలంటూ నినాదాలు
12 గంటల చర్చ, ప్రభుత్వ సమాధానం తర్వాత మళ్లీ చర్చించలేమన్న స్పీకర్
అలవిగాని కోరికలు కోరితే ఎలాగంటూ సీఎం కేసీఆర్ మండిపాటు
పోడియం వద్ద ఎమ్మెల్యేల బైఠాయింపు.. 29 మంది సస్పెన్షన్
మండలిలోనూ రభస.. ఐదుగురు కాంగ్రెస్, ఒక బీజేపీ ఎమ్మెల్సీ సస్పెన్షన్
నిరసనగా అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద విపక్షాల ధర్నా

 
సాక్షి, హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలు, ఏకమొత్తంగా రుణమాఫీ అంశాలపై సోమవారం శాసనసభ, శాసనమండలి అట్టుడికిపోయాయి. రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ ఎంఐఎం మినహా విపక్షాలన్నీ ఇరు సభలనూ స్తంభింపజేశాయి. రెండు సభల్లోనూ పోడియం వద్ద బైఠాయింపులు, నినాదాలు, ప్లకార్డులతో గందరగోళం సృష్టించాయి. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం మొత్తం విపక్షంపై వేటు వేసింది. ఇరు సభల్లోనూ ప్రతిపక్షాల సభ్యులను ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేసింది.
 
 అసెంబ్లీలో 29 మంది సభ్యుల సస్పెన్షన్‌కు మంత్రి హరీశ్‌రావు తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్ మధుసూదనాచారి దానిని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. మండలిలో మంత్రి తుమ్మల ఆరుగురు సభ్యుల సస్పెన్షన్‌కు తీర్మా నం ప్రవేశపెట్టగా చైర్మన్ స్వామిగౌడ్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. శాసనసభలో సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలు బయటికి వెళ్లకుండా పోడియం వద్దే బైఠాయించగా... మార్షల్స్‌తో వారిని బలవంతంగా బయటకు పంపారు. అయితే అసెంబ్లీలో సస్పెన్షన్‌కు గురైనవారిలో ప్రధాన ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యల పేర్లు లేకపోవడం గమనార్హం.
 సభా ప్రారంభంలోనే...
 
 సోమవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపడుతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ సభ్యులు తమ స్థానాల్లోంచి లే చి రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు ‘రైతులను ఆదుకోవాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కూర్చోవాల్సిందిగా స్పీకర్ సూచించగా... ఓ పక్కన రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే ఎలా కూర్చుంటామని ప్రశ్నించారు. ‘రైతు సమస్యలపై రెండు రోజు లు చర్చించినా పరిష్కారం సున్నా. వారికి భరోసానిచ్చే సమాధానం ప్రభుత్వం చెప్పాలి’ అని టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ సభను గాడిలో పెట్టడానికి లేచి నిలబడి అందరినీ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్పీకర్ నిలబడటంతో.. విపక్ష సభ్యులు సభా సంప్రదాయాలను గౌరవించి తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చున్నారు. స్పీకర్ కూర్చోగానే... వారంతా మళ్లీ ముందుకు వచ్చి నినాదాలతో సభను అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వం దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పినందున సభ జరిగేందుకు సహకరించాలని స్పీకర్ కోరారు. అయినా విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సీఎం జోక్యం చేసుకున్నారు.
 
 చర్చ పూర్తయ్యాక సమాధానమా?
 రైతుల సమస్యలు, ఆత్మహత్యలపై బీఏసీలో నిర్ణయం తీసుకుని రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించామని, ప్రభుత్వపరంగా వారిని ఆదుకునేందుకు ఏం చేయదలచుకున్నదీ స్పష్టంగా చెప్పామని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘మేం ఏది చెప్పామో అదే జరిగి తీరాలన్నట్లుగా విపక్షాలు వ్యవహరించడం మంచిది కాదు. అలవిగాని కోరికలు కోరి ఇప్పుడే, ఇక్కడే సమాధానాలు, పరిష్కారాలు కావాలంటే సరికాదు. సభలో మెజార్టీ సభ్యులు సభ సజావుగా జరగాలని కోరుకుంటున్నారు. కొద్దిమంది మాత్రమే అడ్డుకోవాలని చూస్తే దానికి వేరే పద్ధతులున్నాయి. ప్రజాస్వామ్యంలో మీకు ఒక విధానం నచ్చకపోతే నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. అంతేకానీ సభను పూర్తిగా నడ వనీయబోమం టే కుదరదు’’ అన్నారు. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు కొనసాగించే ప్రయత్నం చేశారు.
 
 వెనక్కి తగ్గని విపక్షాలు
 సీఎం వ్యాఖ్యలు, స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టడంపై విపక్షం భగ్గుమంది. మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానం చెబుతుండగానే.. టీడీపీ, కాం గ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. కొందరు సభ్యులు పోడియం ముందు బైఠాయించారు. వారికి మద్దతుగా బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ సభ్యులు నిరసనకు దిగారు. ఈక్రమంలో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న సభ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావును స్పీకర్ ఆదేశించారు. అప్పటికే ఆయా సభ్యుల పేర్లతో కూడిన జాబితా హరీశ్‌రావుకు చేరింది.ప్రతిపక్ష నేత జానారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, టీడీపీ సభ్యుడు కృష్ణయ్య మినహా మిగతా 29మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ హరీశ్‌రావు ప్రతిపాదించారు. తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా సభను కోరడం, మూజువాణి ఓటుతో ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఈ సమావేశాల మొత్తానికి ఈ 29మంది సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
 
 దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం!
 సస్పెండైన ఎమ్మెల్యేలు సభను వీడాలని స్పీకర్ పదేపదే కోరినా వారు పట్టించుకోలేదు. ‘ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం’ అని నినాదాలు చేస్తూ పోడియం వద్దే ఉండిపోయారు. దీంతో స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్... వారిని బలవంత ంగా బయటకు తరలించారు. సస్పెండైన విపక్ష ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర కొద్దిసేపు ధర్నా చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.      
 
 సస్పెన్షన్‌కు గురైన సభ్యులు
 శాసనసభలో..
 కాంగ్రెస్: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పద్మావతి, చిన్నారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, భాస్కర్‌రావు, సంపత్‌కుమార్, డీకే అరుణ, వంశీచంద్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మాధవరెడ్డి.
 వైఎస్సార్‌సీపీ: పాయం వెంకటేశ్వర్లు
 టీడీపీ: రేవంత్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, వివేకానంద, మాగంటి గోపీనాథ్, సాయన్న, రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్
 బీజేపీ: లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్
 సీపీఐ: రవీంద్రకుమార్
 సీపీఎం: సున్నం రాజయ్య
 మండలిలో..
 కాంగ్రెస్: షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్, ఫారుఖ్‌హుస్సేన్, ఆకుల లలిత
 బీజేపీ: రామచంద్రరావు
 
 ఇక ఐక్య పోరాటం..
విపక్షాల సభ్యులను నిరంకుశంగా సస్పెండ్ చేయడంపై ఆయా పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ శాసనసభా పక్షాల నేతలు అసెంబ్లీ ఆవరణలోనే కొద్దిసేపు సమావేశమయ్యారు. ప్రభుత్వ తీరుపై శాసనసభలో ఐక్యంగా పోరాడుతున్న స్ఫూర్తితోనే ప్రజాక్షేత్రంలోనూ పోరాడాలని భావించారు. పార్టీలుగా ఎవరి కార్యక్రమాలు, యాత్రలు వారు చేసుకున్నా ఈ నెల 10న బంద్‌ను ఉమ్మడిగా నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ యాత్రల తేదీలను వేర్వేరుగా ఖరారు చేసుకున్నాయి. ఈనెల 10న జరిగే బంద్‌ను మాత్రం ఉమ్మడిగా నిర్వహిస్తామని ప్రకటించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement