పార్లమెంటుకు సూచీ పార్టీ
ప్రస్తుత సమావేశాలకు హాజరు
యాంగాన్: మయన్మార్ సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంతో ఆంగ్‌సాన్ సూచీకి చెందిన ప్రతిపక్ష నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ నూతనోత్సాహంతో సోమవారం ప్రస్తుత పార్లమెంటు చివరి సమావేశాలకు హాజరైంది. నూతన పార్లమెంటు కొలువుదీరడానికి ఫిబ్రవరి దాకా సమయం ఉండటంతో ఈలోగా మాజీ సైనిక పాలకులు రాజకీయ గిమ్మిక్కులకు పాల్పడతారేమోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి నూరు శాతం కచ్చితంగా అధికార బదిలీ జరుగుతుందని తాము భావించట్లేదని ఎన్‌ఎల్‌డీ ప్రతినిధి విన్ తీన్ పేర్కొన్నారు. 1990లో ఎన్‌ఎల్‌డీ భారీ విజయం సాధించినప్పటికీ సైనిక పాలకులు అధికారాన్ని అట్టిపెట్టుకోవడాన్ని ప్రస్తావించారు.
కాగా, సోమవారం పార్లమెంటుకు చేరుకున్న ఎన్‌ఎల్‌డీ నేత సూచీ విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించారు. నవంబర్ 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ దాదాపు 80 శాతం సీట్లు సాధించి సైన్యం మద్దతిస్తున్న ప్రస్తుత అధికార యూనియన్ సోలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీని మట్టికరిపించింది. కానీ ప్రస్తుత పార్లమెంటు చివరి సమావేశాలు జనవరి దాకా జరగనుండటంతో అప్పటివరకు యూఎస్‌డీపీ ఎంపీల ఆధిపత్యం కొనసాగనుంది. మరోవైపు పార్లమెంటులోని మొత్తం 1,139 సీట్లకుగాను ప్రతిపక్ష ఎన్‌ఎల్‌డీ 880 సీట్లు (77.3 శాతం) సాధించగా అధికార యూనియన్ సోలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (యూఎస్‌డీపీ) 115 సీట్లు గెలుచుకున్నట్లు మయన్మార్ కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. మిగిలిన స్థానాలను ఇతర చిన్న పార్టీలు గెలుచుకున్నాయి. విదేశీయులను పెళ్లి చేసుకునే మయన్మార్ పౌరులు దేశాధ్యక్ష పదవికి అనర్హులంటూ గతంలోని జుంటా సర్కారు రాజ్యాంగాన్ని మార్చడంతో సూచీ దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హురాలు.