Angsan Suu Kyi
-
అంగ్‌సాన్ సూకీకి మరో నాలుగేళ్ల జైలు
బ్యాంకాక్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పదవీచ్యుత నేత అంగ్‌సాన్ సూకీ(76)కి మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ మయన్మార్‌లోని ఓ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్ ఆంక్షలను ధిక్కరించిన కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చిందని న్యాయశాఖ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో వివిధ నేరాలకు పాల్పడ్డారంటూ కోర్టు సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా మిలటరీ పాలకులు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గించారు. సూకీకి చెందిన నేషనల్ లీగ్ఫర్ డెమోక్రసీ పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న తరుణంలో గత ఫిబ్రవరిలో మిలటరీ.. సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధంలో ఉంచి పలు అభియోగాలు మోపింది. అవన్నీ రుజువైతే ఆమెకు 100 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. -
మిలటరీ గుప్పెట్లో మయన్మార్
నేపిదా: స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే బర్మాలో ప్రజాస్వామ్యం కనిపించింది. అధిక కాలం మిలటరీ గుప్పెట్లోనే బర్మా గడిపింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మయన్మార్‌లో జరిగిన కీలక సంఘటనల సమాహారం పరిశీలిస్తే.. 1948, జనవరి 4: బర్మాకు బ్రిటీష్ వారినుంచి స్వాతంత్రం లభించింది. 1962: మిలటరీ నేత నీ విన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పాలనా పగ్గాలు చేపట్టారు. 1988: ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఆంగ్‌సాన్ సూకీ విదేశీ ప్రవాసం నుంచి స్వదేశానికి వచ్చారు. దేశంలో జుంటా(మిలటరీ సమూహం)పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో జరిగిన నిరసనలపై మిలటరీ కాల్పులు జరపగా వందలాది మంది మరణించారు. 1989, జూలై: జుంటాపై తీవ్ర విమర్శలు చేస్తున్న సూకీని హౌస్ అరెస్టు చేశారు. 1990, మే 27: ఎన్నికల్లో సూకీ పార్టీ ద నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ బంపర్ మెజార్టీ సాధించింది. కానీ పాలనా పగ్గాలు అందించేందుకు జుంటా నిరాకరించింది. 1991, అక్టోబర్: సూకీకి శాంతియుత పోరాటానికిగాను నోబెల్ శాంతి బహుమతి దక్కింది. 2010, నవంబర్ 7: ఇరవై సంవత్సరాల తర్వాత జరిపిన ఎన్నికల్లో జుంటా అనుకూల పార్టీకి అత్యధిక సీట్లు దక్కాయి. 2010, నవంబర్ 13: దశాబ్దాల హౌస్ అరెస్టు అనంతరం సూకీ విడుదలయ్యారు. 2012: పార్లమెంట్ బైఎలక్షన్లో సూకీ విజయం సాధించారు. 2015, నవంబర్ 8: సూకీ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కీలక పదవులను జుంటా తన చేతిలో ఉంచుకొని సూకీకి స్టేట్ కౌన్సిలర్ పదవి కట్టబెట్టింది. 2017, ఆగస్టు 25: రోహింగ్యాలపై మిలటరీ విరుచుకుపడింది. దీంతో వేలాదిమంది బంగ్లాదేశ్‌కు పారిపోయారు. 2019, డిసెంబర్ 11: జుంటాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో సూకీ తమ మిలటరీకి మద్దతుగా నిలిచారు. 2020, నవంబర్ 8: ఎన్నికల్లో సూకీ పార్టీ ఎన్ఎల్డీకి మరోమారు మెజార్టీ దక్కింది. 2021, జనవరి 29: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న జుంటా ఆరోపణలను బర్మా ఎన్నికల కమీషన్ తోసిపుచ్చింది. ఇందుకు సరైన ఆధారాల్లేవని తెలిపింది. 2021, ఫిబ్రవరి 1: దేశాన్ని ఒక సంవత్సరం పాటు ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు మిలటరీ ప్రకటించింది. ఓటింగ్ అక్రమాలపై సూకీ ప్రభుత్వ స్పందన పేలవంగా ఉందని, కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని సూకీ పట్టించుకోలేదని ఆరోపించింది. మరోమారు సూకీని హౌస్ అరెస్టు చేస్తున్నట్లు తెలిపింది. -
మయన్మార్‌లో సైనిక పాలన
నేపిదా: మయన్మార్ పాలన మరోసారి సైనిక జుంటా చేతుల్లోకి వెళ్లిపోయింది. దేశం ఏడాది పాటు సైన్యం ఆధీనంలో ఉంటుందని సైన్యం ఆధీనంలోని ‘మ్యావద్దీ’టీవీ సోమవారం ప్రకటించింది. దేశ కీలక నేత, కౌన్సిలర్ హోదాలో ఉన్న అంగ్‌సాన్ సూకీ(75) సహా సీనియర్ రాజకీయ నేతలను గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల సమయంలో ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం కావడం, కరోనా సంక్షోభ సమయంలో ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయలేకపోయినందునే అధికారం చేజిక్కించుకుంటున్నట్లు ‘మ్యావద్దీ’తెలిపింది. కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హ్లయింగ్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారని తెలిపింది. దేశ సుస్థిరతకు ప్రమాదం వాటిల్లినందున, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కమాండర్ ఇన్ చీఫ్‌కు బదిలీ అయ్యాయని పేర్కొంది. సోమవారం ఉదయం నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యులతో పార్లమెంట్ సమావేశాలు మొదలు కావాల్సిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అధికారం చేజిక్కించుకున్న సైనిక నేత సోమవారం వేకువజాము నుంచే రాజధాని నేపిదాతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ టెలివిజన్ ప్రసారాలు, ఫోన్, ఇంటర్నెట్ వంటి సమాచార సంబంధాలను నిలిపివేశారు. దేశ అగ్రనేత, కౌన్సిలర్ హోదాలో ఉన్న అంగ్‌సాన్ సూకీ, అధ్యక్షుడు విన్ మియింత్లను గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఎన్ఎల్డీ ప్రతినిధి తెలిపారని ఆన్లైన్ మీడియా వెల్లడించింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, ప్రాంతీయ కేబినెట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధరంగాలకు చెందిన ప్రముఖులను కూడా సైనిక పాలకులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హ్లయింగ్ సారథ్యంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మింట్ స్వే ఉంటారని మిలటరీ టీవీ తెలిపింది. ఏడాదిలో ఎన్నికలు జరిపి, గెలిచిన వారికి అధికారం అప్పగిస్తామని ప్రకటించింది. దీనిపై సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్ఎల్డీ) ఒక ప్రకటన విడుదల చేసింది. సైనిక జుంటా చర్య అక్రమం, రాజ్యాంగానికి, ప్రజల అభీష్టానికి వ్యతిరేకం. సైనిక తిరుగుబాటును, నియంతృత్వ పాలనను వ్యతిరేకించాలి’అని కోరింది. అయితే, ఈ పోస్టును ఎవరు పెట్టారో తెలియరాలేదు. ఎన్ఎల్డీ నేతలెవరూ ఫోన్‌కాల్స్‌కు సమాధానం ఇవ్వడం లేదు. దేశీయ విమాన సర్వీసులన్నిటినీ రద్దు చేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. దేశంలోని అతిపెద్ద యాంగూన్ విమానాశ్రయాన్ని మూసివేశారని మయన్మార్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది. ఖండించిన ప్రపంచ దేశాలు దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దాదాపు ఐదు దశాబ్దాల పాటు సైనిక పాలన కొనసాగడం, 1962 నుంచి అంతర్జాతీయంగా ఏకాకిగా మారడం..2015లో ఎన్నికలు జరిగి, ప్రజాస్వామ్యం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం దేశ భవిష్యత్తును మరోసారి ప్రశ్నార్థ్ధకంగా మార్చాయి. ప్రజాస్వామ్యం కోసం అనేక ఏళ్లపాటు గృహ నిర్బంధంలో గడిపిన, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సూకీని సైనిక జుంటా అధికారం నుంచి తొలగించి తిరిగి నిర్బంధంలోకి పంపడంతో ప్రపంచ దేశాలు షాక్‌కు గురయ్యాయి. మయన్మార్‌లో సైన్యం రాజకీయ నేతలను నిర్బంధించడంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ స్పందించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘నిర్బంధంలో ఉంచిన రాజకీయ నేతలు, ప్రభుత్వాధికారులను సైనిక పాలకులు వెంటనే విడుదల చేయాలి. ప్రజాభీష్టానికి లోబడి వ్యవహరించాలి’అని కోరారు. మయన్మార్‌తో బలమైన ఆర్థిక సంబంధాలు నెరపుతున్న పొరుగు దేశం చైనా ఆచితూచి స్పందించింది. అక్కడ జరుగుతున్న పరిణామాలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ పార్టీల నేతలు తమ మధ్య విభేదాలను రాజ్యాంగానికి లోబడి పరిష్కరించుకోవాలంది. మయన్మార్‌లో పరిణామాలు ప్రజాస్వామ్య సంస్కరణలకు తీవ్ర విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి చీఫ్ గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. కారణం ఏమిటి? గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూకీకి చెందిన ఎన్ఎల్డీ ఘన విజయం సాధించగా సైన్యం మద్దతు ఉన్న ప్రతిపక్ష యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఓటమి పాలు కావడం గమనార్హం. సైనిక తిరుగుబాటుకు అవకాశాలున్నాయంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలు నిజమేనని దీంతో తేలిపోయింది. దేశ రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు.. అత్యవసర పరిస్థితుల్లో పాలనా బాధ్యతలను సైన్యం హస్తగతం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నాయని సైనిక నేతలు సమర్థించుకుంటున్నారు. అయితే, ఇది సైనిక తిరుగుబాటు కిందికే వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల్లో తాము మద్దతిచ్చిన రాజకీయ పార్టీలు ఓటమి పాలుకావడం జీర్ణించుకోలేకే సైనిక నేతలు ఈ క్లాజ్‌ను ఉపయోగించుకున్నారని చెబుతున్నారు. అంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంతో సైనిక పాలన మద్దతుదారులు, ప్రతిపక్ష పార్టీల శ్రేణులు యాంగూన్‌లో ర్యాలీలు చేపట్టాయి. -
క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించను
యాంగాన్: మయన్మార్ ప్రజాస్వామిక ఉద్యమకారిణి, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ చీఫ్ ఆంగ్‌సాన్ సూచీ పార్టీ కొత్త ఎంపీలకు ‘క్లాస్’ తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని, తప్పులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శనివారమిక్కడ జరిగిన పార్టీ భేటీలో మాట్లాడుతూ నేతలంతా ఐకమత్యంతో మెలగాలన్నారు. ఎంపీలెవరైనా గ్రూపు రాజకీయాలకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో సైనిక మద్దతుగల అధికార పార్టీని మట్టికరిపించి పార్టీకి అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలను మోసగించరాదన్నారు. -
పార్లమెంటుకు సూచీ పార్టీ
ప్రస్తుత సమావేశాలకు హాజరు యాంగాన్: మయన్మార్ సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంతో ఆంగ్‌సాన్ సూచీకి చెందిన ప్రతిపక్ష నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ నూతనోత్సాహంతో సోమవారం ప్రస్తుత పార్లమెంటు చివరి సమావేశాలకు హాజరైంది. నూతన పార్లమెంటు కొలువుదీరడానికి ఫిబ్రవరి దాకా సమయం ఉండటంతో ఈలోగా మాజీ సైనిక పాలకులు రాజకీయ గిమ్మిక్కులకు పాల్పడతారేమోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి నూరు శాతం కచ్చితంగా అధికార బదిలీ జరుగుతుందని తాము భావించట్లేదని ఎన్ఎల్డీ ప్రతినిధి విన్ తీన్ పేర్కొన్నారు. 1990లో ఎన్ఎల్డీ భారీ విజయం సాధించినప్పటికీ సైనిక పాలకులు అధికారాన్ని అట్టిపెట్టుకోవడాన్ని ప్రస్తావించారు. కాగా, సోమవారం పార్లమెంటుకు చేరుకున్న ఎన్ఎల్డీ నేత సూచీ విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించారు. నవంబర్ 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఎల్డీ దాదాపు 80 శాతం సీట్లు సాధించి సైన్యం మద్దతిస్తున్న ప్రస్తుత అధికార యూనియన్ సోలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీని మట్టికరిపించింది. కానీ ప్రస్తుత పార్లమెంటు చివరి సమావేశాలు జనవరి దాకా జరగనుండటంతో అప్పటివరకు యూఎస్డీపీ ఎంపీల ఆధిపత్యం కొనసాగనుంది. మరోవైపు పార్లమెంటులోని మొత్తం 1,139 సీట్లకుగాను ప్రతిపక్ష ఎన్ఎల్డీ 880 సీట్లు (77.3 శాతం) సాధించగా అధికార యూనియన్ సోలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ (యూఎస్డీపీ) 115 సీట్లు గెలుచుకున్నట్లు మయన్మార్ కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. మిగిలిన స్థానాలను ఇతర చిన్న పార్టీలు గెలుచుకున్నాయి. విదేశీయులను పెళ్లి చేసుకునే మయన్మార్ పౌరులు దేశాధ్యక్ష పదవికి అనర్హులంటూ గతంలోని జుంటా సర్కారు రాజ్యాంగాన్ని మార్చడంతో సూచీ దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హురాలు.