యాంగూన్‌లోని వీధుల్లో బారులు తీరి ఉన్న సైనిక వాహనాలు; జనరల్ మిన్, అంగ్‌సాన్ సూకీ
నేపిదా: మయన్మార్ పాలన మరోసారి సైనిక జుంటా చేతుల్లోకి వెళ్లిపోయింది. దేశం ఏడాది పాటు సైన్యం ఆధీనంలో ఉంటుందని సైన్యం ఆధీనంలోని ‘మ్యావద్దీ’టీవీ సోమవారం ప్రకటించింది. దేశ కీలక నేత, కౌన్సిలర్ హోదాలో ఉన్న అంగ్‌సాన్ సూకీ(75) సహా సీనియర్ రాజకీయ నేతలను గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తోంది.
గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల సమయంలో ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం కావడం, కరోనా సంక్షోభ సమయంలో ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయలేకపోయినందునే అధికారం చేజిక్కించుకుంటున్నట్లు ‘మ్యావద్దీ’తెలిపింది. కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హ్లయింగ్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారని తెలిపింది. దేశ సుస్థిరతకు ప్రమాదం వాటిల్లినందున, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కమాండర్ ఇన్ చీఫ్‌కు బదిలీ అయ్యాయని పేర్కొంది. సోమవారం ఉదయం నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యులతో పార్లమెంట్ సమావేశాలు మొదలు కావాల్సిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
అధికారం చేజిక్కించుకున్న సైనిక నేత
సోమవారం వేకువజాము నుంచే రాజధాని నేపిదాతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ టెలివిజన్ ప్రసారాలు, ఫోన్, ఇంటర్నెట్ వంటి సమాచార సంబంధాలను నిలిపివేశారు. దేశ అగ్రనేత, కౌన్సిలర్ హోదాలో ఉన్న అంగ్‌సాన్ సూకీ, అధ్యక్షుడు విన్ మియింత్‌లను గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఎన్‌ఎల్‌డీ ప్రతినిధి తెలిపారని ఆన్‌లైన్ మీడియా వెల్లడించింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, ప్రాంతీయ కేబినెట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధరంగాలకు చెందిన ప్రముఖులను కూడా సైనిక పాలకులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హ్లయింగ్ సారథ్యంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మింట్ స్వే ఉంటారని మిలటరీ టీవీ తెలిపింది. ఏడాదిలో ఎన్నికలు జరిపి, గెలిచిన వారికి అధికారం అప్పగిస్తామని ప్రకటించింది. దీనిపై సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్‌ఎల్‌డీ) ఒక ప్రకటన విడుదల చేసింది. సైనిక జుంటా చర్య అక్రమం, రాజ్యాంగానికి, ప్రజల అభీష్టానికి వ్యతిరేకం. సైనిక తిరుగుబాటును, నియంతృత్వ పాలనను వ్యతిరేకించాలి’అని కోరింది. అయితే, ఈ పోస్టును ఎవరు పెట్టారో తెలియరాలేదు. ఎన్‌ఎల్‌డీ నేతలెవరూ ఫోన్‌కాల్స్‌కు సమాధానం ఇవ్వడం లేదు. దేశీయ విమాన సర్వీసులన్నిటినీ రద్దు చేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. దేశంలోని అతిపెద్ద యాంగూన్ విమానాశ్రయాన్ని మూసివేశారని మయన్మార్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది.
ఖండించిన ప్రపంచ దేశాలు
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దాదాపు ఐదు దశాబ్దాల పాటు సైనిక పాలన కొనసాగడం, 1962 నుంచి అంతర్జాతీయంగా ఏకాకిగా మారడం..2015లో ఎన్నికలు జరిగి, ప్రజాస్వామ్యం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం దేశ భవిష్యత్తును మరోసారి ప్రశ్నార్థ్ధకంగా మార్చాయి. ప్రజాస్వామ్యం కోసం అనేక ఏళ్లపాటు గృహ నిర్బంధంలో గడిపిన, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సూకీని సైనిక జుంటా అధికారం నుంచి తొలగించి తిరిగి నిర్బంధంలోకి పంపడంతో ప్రపంచ దేశాలు షాక్‌కు గురయ్యాయి. మయన్మార్‌లో సైన్యం రాజకీయ నేతలను నిర్బంధించడంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ స్పందించారు.
అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘నిర్బంధంలో ఉంచిన రాజకీయ నేతలు, ప్రభుత్వాధికారులను సైనిక పాలకులు వెంటనే విడుదల చేయాలి. ప్రజాభీష్టానికి లోబడి వ్యవహరించాలి’అని కోరారు. మయన్మార్‌తో బలమైన ఆర్థిక సంబంధాలు నెరపుతున్న పొరుగు దేశం చైనా ఆచితూచి స్పందించింది. అక్కడ జరుగుతున్న పరిణామాలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ పార్టీల నేతలు తమ మధ్య విభేదాలను రాజ్యాంగానికి లోబడి పరిష్కరించుకోవాలంది. మయన్మార్‌లో పరిణామాలు ప్రజాస్వామ్య సంస్కరణలకు తీవ్ర విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి చీఫ్ గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు.
కారణం ఏమిటి?
గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూకీకి చెందిన ఎన్‌ఎల్‌డీ ఘన విజయం సాధించగా సైన్యం మద్దతు ఉన్న ప్రతిపక్ష యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ ఓటమి పాలు కావడం గమనార్హం. సైనిక తిరుగుబాటుకు అవకాశాలున్నాయంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలు నిజమేనని దీంతో తేలిపోయింది. దేశ రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు.. అత్యవసర పరిస్థితుల్లో పాలనా బాధ్యతలను సైన్యం హస్తగతం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నాయని సైనిక నేతలు సమర్థించుకుంటున్నారు. అయితే, ఇది సైనిక తిరుగుబాటు కిందికే వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల్లో తాము మద్దతిచ్చిన రాజకీయ పార్టీలు ఓటమి పాలుకావడం జీర్ణించుకోలేకే సైనిక నేతలు ఈ క్లాజ్‌ను ఉపయోగించుకున్నారని చెబుతున్నారు. అంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంతో సైనిక పాలన మద్దతుదారులు, ప్రతిపక్ష పార్టీల శ్రేణులు యాంగూన్‌లో ర్యాలీలు చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment