National League for Democracy
-
సూకీపై కొత్తగా అక్రమ వాకీటాకీల కేసు
యాంగాన్: మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ) అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూకీపై పోలీసులు కొత్త ఆరోపణలు ప్రారంభించారు. విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న వాకీటాకీలు ఆమె ఇంట్లో లభ్యమయ్యాయని, ఈ కేసులో ఆమెను ఫిబ్రవరి 15దాకా నిర్బంధంలో ఉంచుతామన్నారు. ప్రభుత్వం వద్ద రిజిస్టర్ కాని వాకీటాకీలను సూకీ భద్రతా సిబ్బంది వాడారని పేర్కొన్నారు. మయన్మార్‌లో సోమవారం కొత్త ప్రభుత్వాన్ని కూలదోసి, సైన్యం అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అదే రోజు ఆంగ్ సాన్ సూకీని, ఆమె పార్టీకి చెందిన ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా వాకీటాకీల దిగుమతి కేసులో సూకీకి గరిష్టంగా రెండేళ్ల దాకా జైలుశిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఆ ప్రజా వనితకు దేశ అధ్యక్ష పదవి?
నెపిడా: మయన్మార్ ప్రజస్వామిక ప్రతీక అంగ్ సాన్ సూకి మయన్మార్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు ముందడుగు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడ ఆమెకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు రెండు వార్తా చానెళ్లు తెలిపిన కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అంగ్ సాన్ సూకి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాజ్యాంగ పరంగా ఉన్న అడ్డంకిని తొలగించేందుకు అటు సూకి, ఆ దేశ మిలటరీ వర్గాల మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు ఆ చానెళ్లు తెలిపాయి. గత ఏడాది నవంబర్ 8న మయన్మార్ లో జరిగిన ఎన్నికల్లో సూకి పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి (ఎన్ఎల్డీ) భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సూకికి రాజ్యాంగపరంగా ఇబ్బంది కూడా ఉంది. ఆ రాజ్యాంగంలోని నిబంధన 59(ఎఫ్) విదేశీయులను భర్తగా చేసుకున్న ఓ వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించదు. సూకి భర్త ఓ బ్రిటన్ దేశానికి చెందిన వాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. మయన్మార్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమించడంలో సూకిది కీలక పాత్ర. ఆమెను ఓ గొప్ప వ్యక్తిగా ఆ దేశ ప్రజలు భావిస్తారు. కానీ, అలాంటి వ్యక్తికి తమను పాలించే అవకాశం లేకపోవడం కూడా అక్కడి ప్రజలకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ఉన్నత మిలటరీ విభాగంతో గత కొద్ది రోజులుగా జరుపుతున్న చర్చలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, రాజ్యాంగంలోని ఆ ఆర్టికల్ ను తొలగించేందుకు యోచన చేస్తున్నారని తెలిసింది. అయితే, సూకి అధ్యక్ష బాధ్యతల అంశంపై ఇప్పుడే అధికారికంగా ప్రకటన చేయడం తొందరపాటు చర్య అవుతుందని అక్కడి ఓ న్యాయ ప్రముఖుడు అన్నారు. -
క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించను
యాంగాన్: మయన్మార్ ప్రజాస్వామిక ఉద్యమకారిణి, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ చీఫ్ ఆంగ్‌సాన్ సూచీ పార్టీ కొత్త ఎంపీలకు ‘క్లాస్’ తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని, తప్పులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శనివారమిక్కడ జరిగిన పార్టీ భేటీలో మాట్లాడుతూ నేతలంతా ఐకమత్యంతో మెలగాలన్నారు. ఎంపీలెవరైనా గ్రూపు రాజకీయాలకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో సైనిక మద్దతుగల అధికార పార్టీని మట్టికరిపించి పార్టీకి అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలను మోసగించరాదన్నారు. -
పార్లమెంటుకు సూచీ పార్టీ
ప్రస్తుత సమావేశాలకు హాజరు యాంగాన్: మయన్మార్ సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంతో ఆంగ్‌సాన్ సూచీకి చెందిన ప్రతిపక్ష నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ నూతనోత్సాహంతో సోమవారం ప్రస్తుత పార్లమెంటు చివరి సమావేశాలకు హాజరైంది. నూతన పార్లమెంటు కొలువుదీరడానికి ఫిబ్రవరి దాకా సమయం ఉండటంతో ఈలోగా మాజీ సైనిక పాలకులు రాజకీయ గిమ్మిక్కులకు పాల్పడతారేమోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి నూరు శాతం కచ్చితంగా అధికార బదిలీ జరుగుతుందని తాము భావించట్లేదని ఎన్ఎల్డీ ప్రతినిధి విన్ తీన్ పేర్కొన్నారు. 1990లో ఎన్ఎల్డీ భారీ విజయం సాధించినప్పటికీ సైనిక పాలకులు అధికారాన్ని అట్టిపెట్టుకోవడాన్ని ప్రస్తావించారు. కాగా, సోమవారం పార్లమెంటుకు చేరుకున్న ఎన్ఎల్డీ నేత సూచీ విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించారు. నవంబర్ 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఎల్డీ దాదాపు 80 శాతం సీట్లు సాధించి సైన్యం మద్దతిస్తున్న ప్రస్తుత అధికార యూనియన్ సోలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీని మట్టికరిపించింది. కానీ ప్రస్తుత పార్లమెంటు చివరి సమావేశాలు జనవరి దాకా జరగనుండటంతో అప్పటివరకు యూఎస్డీపీ ఎంపీల ఆధిపత్యం కొనసాగనుంది. మరోవైపు పార్లమెంటులోని మొత్తం 1,139 సీట్లకుగాను ప్రతిపక్ష ఎన్ఎల్డీ 880 సీట్లు (77.3 శాతం) సాధించగా అధికార యూనియన్ సోలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ (యూఎస్డీపీ) 115 సీట్లు గెలుచుకున్నట్లు మయన్మార్ కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. మిగిలిన స్థానాలను ఇతర చిన్న పార్టీలు గెలుచుకున్నాయి. విదేశీయులను పెళ్లి చేసుకునే మయన్మార్ పౌరులు దేశాధ్యక్ష పదవికి అనర్హులంటూ గతంలోని జుంటా సర్కారు రాజ్యాంగాన్ని మార్చడంతో సూచీ దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హురాలు. -
సూచీ కే గెలుపు అవకాశాలు
మయన్మార్ ఎన్నికల ర్యాలీకి తరలివస్తున్న జనం యాంగాన్: దశాబ్దాల తరబడి సైనిక పాలనలో మగ్గిన మయన్మార్‌లో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నవంబర్ 8న జరిగే ఈ ఎన్నికల్లో విపక్ష నాయకురాలు ఆంగ్‌సాన్ సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ విజయపథంలో దూసుకుపోతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. ఆదివారం యాంగాన్‌లో సూకీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి వేలాది ప్రజలు తరలి వచ్చారు. ఈ ఎన్నికల్లో గెలవటానికి కొందరు దొంగదారులు వెతుకుతున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో సంయమనంతో పాల్గొనాలని ఓటర్లను కోరారు. అయితే సైనిక మద్దతు ఉన్న యునెటైడ్ సాలిడారిటీ-డెవలప్మెంట్ పార్టీ(యూఎన్డీపీ)కూడా సూచీ పార్టీతో హోరాహోరీగా తలపడుతోంది. యూఎన్డీపీ గెలిస్తే దేశంలోని తమకు మళ్లీ కష్టాలు తప్పవని మైనారిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఎన్నికలు వీరిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. సైనిక పాలన నుంచి విముక్తి లభిస్తుందని వారు ఆశతో ఉన్నారు.