
2025 ఫిబ్రవరి 1న మయన్మార్ అంత ర్యుద్ధం ఐదో సంవత్సరంలోకి ప్రవేశించింది. ‘తమడో’ (మయన్మార్ సైనిక బలగాలు) తిరుగుబాటు చేసినప్పటి నుండి దేశంలో జనజీవితం మారిపోయింది. 2020 ఎన్ని కలలో గెలిచినప్పటికీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ నేతృత్వంలోని ప్రభుత్వం అధి కారంలోకి రావడానికి సైనిక నాయకత్వం ఎన్నడూ అనుమతించలేదు. దాని నాయకు లను, మద్దతుదారులను అరెస్టు చేశారు. ఏడాదిపాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
సైన్యం ద్వారా నూతన ప్రభుత్వం ‘స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్’ ఏర్పడింది. దీనికి సైన్యం కమాండర్ ఇన్‌చీఫ్ అయిన సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ నాయకత్వం వహి స్తున్నారు. ఆయన తనను తాను మయన్మార్ ప్రధానమంత్రిగా ప్రక టించుకున్నారు. 2008 రాజ్యాంగం ప్రకారం ఈ పదవి లేదు. సంవ త్సరం లోపే ఎన్నికలు జరుగుతాయని ఆయన హామీ ఇచ్చారు.
2025లో మయన్మార్ ఎన్నికలపై ఊహాగానాలు జరుగు తున్నాయి. ప్రతిపక్ష నాయకులను, జుంటా (సైనిక నాయకత్వం) వ్యతిరేకులను అరెస్టు చేస్తూనే ఉన్నారు. అంతర్యుద్ధానికి పరిష్కారా లను కనుగొనే ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. మయన్మార్ ప్రజలు బాధలకు గురవుతూనే ఉన్నారు. గ్రామాలను తగలబెట్టడం, వైమానిక బాంబు దాడులు, మరణ శిక్షలు వంటి పాత వ్యూహాలనే సైనిక నాయకత్వం ఉపయోగిస్తున్న క్రమంలో, మయన్మార్‌లో అంత ర్గతంగా స్థానభ్రంశం చెందిన వ్యక్తుల సంఖ్య 33 లక్షలను దాటింది.
తగ్గుతున్న సైన్య ప్రాభవం
గత రెండేళ్ల కాలంలో, మయన్మార్‌లో సైనిక బలగాల అధికారం, భూభాగంపై నియంత్రణ తగ్గిపోవడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. జనరల్ నే విన్ తలపెట్టిన 1962 సైనిక కుట్ర, సైనిక కుట్రకు దారితీసిన 1988 తిరుగుబాటు రెండు సందర్భాల్లోనూ అధికారం చేజిక్కించుకున్నాక సైన్యం బలపడింది. కానీ 2021 సైనిక కుట్ర తర్వాత విషయాలు భిన్నంగా ఉన్నాయి. ప్రజా ప్రతిఘటన మరింత ఆచరణీయమైన నిర్మాణంతో తన బలాన్ని పెంచుకుంది.
ప్రవాసంలో ఉన్న ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్’ ఏర్పర్చిన ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్’ సైనిక అణచివేతను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా సహ కరించింది. ఇది పౌర అవిధేయతా ఉద్యమానికి ఊపునిచ్చింది. ప్రజా స్వామ్యం నుండి మయన్మార్ వెనక్కి తగ్గడం వల్ల నిరాశ చెందిన యువత ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో చేరారు.
దీనికి సమాంతరంగా, అనేక జాతి సాయుధ సంస్థలు ఈ అవ కాశాన్ని ఉపయోగించుకుని అవి చాలా కాలంగా పోరాడుతున్నప్రాంతాల నుండి తమడో బలగాలను వెనక్కి నెట్టాయి. షాన్ లోని ‘మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ’, ‘తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ’, రఖైన్ లోని ‘అరకాన్ ఆర్మీ’, కరెన్నిలోని ‘కరెన్ని ఆర్మీ’ దీనికి కొన్ని ఉదాహరణలు.
ఆసక్తికరంగా, ‘కాచిన్ ఇండిపెండెన్్స ఆర్మీ’ వంటి అనేక జాతీయ సాయుధ సంస్థలు ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్’కు బహిరంగంగా మద్దతు ఇచ్చాయి. తమడోకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇలాంటి వివిధ సంయుక్త ఫ్రంట్‌ల ఉనికి మయన్మార్‌లో దీర్ఘకాలిక అంతర్యుద్ధానికి ప్రారంభ సంకేతం. గతంలో మాదిరిగా కాకుండా, మయన్మార్ అంతటా ఉన్న 330 టౌన్ షిప్‌లలో కనీసం 321 పట్టణాలకు ఈ పోరాటం వ్యాపించిందని వార్తలు వస్తున్నాయి.
మయన్మార్ సైనిక బలగమైన తమడో అనేక కీలకమైన అంశా లలో విఫలమైంది. బలగాల పరంగా, 2024లో ఉన్న సైనికుల సంఖ్య 4,00,000 నుండి కేవలం 70,000కు పడిపోయింది. చాలా మంది సైన్యాన్ని విడిచిపెట్టి, వెళ్లిపోయారు. దీనికి ప్రాథమిక వేతనం, బీమా లేకపోవడంతో పాటు ఇతర కారణాలు ఉన్నాయి. తమడో బలగా లకు నైతిక స్థైర్యం, యుద్ధరంగంలో నైపుణ్యాలు లేకపోవడం కూడా ఉంది. నాయకత్వ పరంగా, మిన్ ఆంగ్ హ్లైంగ్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నారు.
2024 ఆగస్టులో జరిగిన ఒక అంతర్గత కుట్ర గురించిన పుకార్లు, మయన్మార్‌లో పరిస్థితులు అంత చక్కగా లేవని సూచి స్తున్నాయి. సైన్యంలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న మిన్ ఆంగ్‌హ్లైంగ్, సో విన్ ఇద్దరూ 2023లో నేపిటా ప్రాంతంలో త్రుటిలో తప్పించుకున్నారు. ఇది వారి రక్షణ దుర్బలత్వాన్ని బహిర్గతంచేసింది. తమడో తన భూభాగాలను నిలుపుకోలేకపోవడం మరింత ముఖ్యమైనది. మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ, తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, అరకాన్ ఆర్మీలతో కూడిన ‘త్రీ బ్రదర్‌హుడ్ అలయన్స్’ 2023 అక్టోబర్‌లో నిర్వహించిన ‘ఆపరేషన్ 1027’ ఈ విషయంలో ఒక మలుపు అని చెప్పాలి.
దీని తర్వాత కరెన్ని రాష్ట్రంలో జరిగిన ‘ఆపరేషన్ 1111’ ద్వారా ప్రతిఘటనా బలగాలు ప్రయోజనాలు సాధించాయి. కొత్త పాలనా వ్యవస్థలను ఎలా రూపొందిస్తున్నారో చూపించే తాత్కాలిక కార్య నిర్వాహక మండలిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. 2024 ప్రారంభం నాటికి, మయన్మార్ భూభాగంలో 50 శాతాన్ని సైనికేతర దళాలే నియంత్రిస్తున్నట్లు నివేదికలు వచ్చాయి.
అంతర్యుద్ధం ముగిసిపోతుందా?
సైనిక నియంతృత్వం విఫలమైతే, అంతర్యుద్ధం ముగిసిపోతుందా? అంతర్యుద్ధానికి అంత తేలికైన ముగింపు లేదు. ఈ అంత ర్యుద్ధంలో పాల్గొంటున్న పార్టీల సంఖ్య చాలా ఎక్కువ. 2021 నుండి యుద్ధంలో పాల్గొంటున్న కొత్త ప్రభుత్వేతర సైనికుల సంఖ్య 2,600 అని ఒక అంచనా. ఉదాహరణకు, ‘మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ’, ‘షాన్ స్టేట్ ప్రోగ్రెసివ్ పార్టీ’ వంటి వాటి మధ్య కూడా పోరాటం ఉంది. ఇవి రెండూ ‘ఫెడరల్ పొలిటికల్ నెగో షియేషన్ అండ్ కన్సల్టేటివ్ కమిటీ’లో భాగం.
‘త్రీ బ్రదర్‌హుడ్ అల యన్స్’ కూడా మయన్మార్ పరిణామాలపై భిన్నమైన అభిప్రాయా లను కలిగి ఉంది. చైనా ఆదేశం మేరకు, ‘తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ’ 2024లో కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ‘మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ’ ఇటీవలే దానిని అనుసరించింది. కానీ తమడో ఆధీనంలో ఉన్న రఖైన్ లోని చివరి కీలకప్రాంతాలలో ఒకటైన సిట్వే వద్ద సైన్యంతో పూర్తి యుద్ధానికి ‘అరకాన్ ఆర్మీ’ సిద్ధమవుతోంది. అందువల్ల, మయన్మార్ ముఖచిత్రం చాలా అస్పష్టంగా ఉంది.
ఇప్పుడు ఏమి జరగవచ్చు? మొదట, మయన్మార్ విచ్ఛిన్నం కావడం ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న జాతి రాజ్యాలు సైనిక దళాల నియంత్రణ నుండి దాదాపుగా బయటపడ్డాయి. ప్రత్యేక రాజ్యాలు లేదా ముఖ్యంగా రఖైన్ లో ఏదో ఒక రకమైన సమాఖ్య కోసం ప్రకటన కూడా తయారు కావచ్చు. అయినప్పటికీ, బామర్లు నివసించే ప్రాంతాల్లో సైనిక దళాలు అధికారంలో ఉంటాయని ఒక అంచనా. సైనిక దళాలు ప్రతి పాదిస్తున్నట్లుగా 2025లో ఎన్నికలు జరిగితే, అది సైన్యం ఆధ్వర్యంలోని ‘స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్’(ఎస్‌ఏసీ) పాలనను మరింత చట్టబద్ధం చేయడానికే ఉపయోగపడుతుంది.
దీని అర్థం సైనిక కుట్ర తర్వాత గత వారం ఏడవసారి పొడిగించిన అత్యవసర పరిస్థితి ఈ ఏడాది కూడా ముగిసిపోదు. చైనా ప్రాబల్యంలోని పార్టీలను చర్చ లకు తీసుకురాగలిగితే, కొత్త సైనిక ప్రభుత్వం ఎస్‌ఏసీ స్థానంలోకి రావచ్చు. కానీ, ఇది మయన్మార్ కోసం మరొక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే పనిలో పడుతుంది. మళ్లీ దేశ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మయన్మార్ గతంలోకంటే ఈ ఏడాది మరింత వార్తల్లో ఉంటుంది.
- వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, డైరెక్టర్ ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలోని నెహ్గిన్ పావో కిప్జెన్ సెంటర్ ఫర్ ఆగ్నేయాసియా స్టడీస్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
-శ్రబణ బారువా
Comments
Please login to add a commentAdd a comment