ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూత తమిళనాడు రాజకీయాలకు ఒక షాక్‌లాంటిదే. సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన జయలలిత కడసారి చూపు కోసం అశేషమైన ప్రజానీకమే కాదు.. అన్ని రాజకీయ పక్షాల నేతలు చెన్నైకి తరలివచ్చారు. అయితే, జయలలిత తదనంతరం తమిళనాడు రాజకీయాలు ఎలా ఉంటాయి? ఏయే పరిణామాలు జరిగే అవకాశముంది? అన్నదానిపై రాజకీయ పరిశీలకుల అంచనా ఇది.
అన్నాడీఎంకే..
-
ప్రస్తుతం అన్నాడీఎంకేలో శశికళ కోటరి బలంగా ఉంది. ఆమెకు 60కిపైగా ఎమ్మెల్యేలు, 12మంది మంత్రుల మద్దతు ఉన్నట్టు చెప్తున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు డీఎంకే చేసే ప్రయత్నాలను శశికళ కోటరి గట్టిగా తిప్పికొట్టవచ్చు.
-
అన్నాడీఎంకేలో ఇప్పుడు చాలా గ్రూపులు బలంగా ఉన్నాయి. అయితే తాత్కాలికంగా ఈ గ్రూపుల తమ విభేదాలను పక్కనబెట్టి అధికార యంత్రాంగం సహకారంతో పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రయత్నించవచ్చు.
-
శశికళ కోటరి ఇప్పట్లో పన్నీర్ సెల్వం పదవికి ఎసరు పెట్టే ప్రయత్నాలు చేయకపోవచ్చు. స్వయంగా జయలలితే పన్నీర్ సెల్వంపై విశ్వాసం ఉంచిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడే ఆయన పదవికి గండం రాకపోవచ్చు.
-
శశికళ మోసం చేసే అవకాశం ఉందని భావిస్తే ఆమెకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే క్యాడర్ తిరుగుబాటు చేయొచ్చు
-
ముక్కులథోర్ (థెవర్) కుల సమీకరణాన్ని శశికళ తెరపైకి తేవచ్చు. జయలలితకు బలంగా అండగా నిలిచిన సామాజికవర్గాల్లో ముక్కులథోర్ కీలకమైనది. అదేవిధంగా దక్షిణ తమిళనాడులో బలంగా ఉన్న ముక్కులథోర్, పశ్చిమ తమిళనాడులో బలంగా ఉన్న గౌండర్ సామాజిక వర్గాల మధ్య సామరస్యానికి శశికళ ప్రయత్నించవచ్చు. ఈ మేరకు కొత్త సీఎంను శశికళ నామినేట్ చేస్తే.. గౌండర్ వర్గానికి చెందిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురైకి మరిన్ని అధికారాలు లభించవచ్చు.
- అన్నాడీఎంకేలో తనపట్ల అసమ్మతిని చల్లార్చేందుకు సీఎం జయలలితకు ప్రధాన సలహాదారుగా పనిచేసిన షీలా బాలకృష్ణన్‌ను రంగంలోకి తేవచ్చు.
డీఎంకే
-
అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించి తనవైపు మలుపుకొనే ప్రయత్నం చేసినప్పటికీ, తాజా ఎన్నికలకు వెళ్లకపోవచ్చు.
-
అధికార పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు స్టాలిన్ నాయకత్వంలో పనిచేసేందుకు అంగీకరించవచ్చు.
- అయితే, అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చడంలో మాత్రం ఆచితూచి వ్యవహరించే అవకాశం. అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోతే.. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రపతి పాలన విధించి.. రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టు పెంచుకొనే అవకాశం ఉండటంతో ఆచితూచి అడుగులు వేయవచ్చు.
బీజేపీ
-
తమిళనాడులో తాజాగా ఎన్నికలు వస్తే శశికళ కోటరితో బీజేపీ చేతులు కలిపే అవకాశం.
-
కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నించవచ్చు.
- తమిళనాడులో ప్రభుత్వాన్ని మార్చేందుకు కేంద్రం సహకరించే అవకాశం. అయితే, బలమైన నేత లేకుండా బీజేపీ సొంతంగా తమిళనాడులో ఎదగటం అసాధ్యమే.
కాంగ్రెస్
- కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నాడీఎంకేలోకి క్యూ కట్టడంతో ఆ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారిపోవచ్చు.