జాతీయ పార్టీల మద్దతు దిశగా స్టాలిన్
న్యూఢిల్లీ : తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిణామాలను రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లిన డీఎంకే, ఈ విషయంపై జాతీయ పార్టీల మద్దతును బలంగా కూడగట్టుకోవాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో నేడు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ భేటీ కానున్నారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని వారికి వివరించనున్నారు. సోనియా గాంధీ నివాసం జనపథ్ 10 వద్ద కాంగ్రెస్ టాప్ నేతలను స్టాలిన్ కలువనున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ టాప్ నేతలను కలిసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ సితారాం ఏచూరిని కలవాలని డీఎంకే నేత ప్లాన్ వేస్తున్నారు. గురువారం రాష్ట్రపతిని కలిసిన స్టాలిన్, సీక్రెట్ బాలెట్కు అనుమతిచ్చి, మళ్లీ తాజాగా ఓటింగ్ నిర్వహించేలా తమిళనాడు గవర్నర్ను ఆదేశించాలని కోరారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన స్టాలిన్, పళని బలనిరూపణ సందర్భంగా తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు తలెత్తినట్టు పేర్కొన్నారు.. తమ 89 మంది ఎమ్మెల్యేలను బయటికి పంపించేసి ఓటింగ్ నిర్వహించారని చెప్పారు. రూలింగ్ పార్టీకి అనుకూలంగా అసెంబ్లీ స్పీకర్ వ్యవహరించారని మండిపడ్డారు. అంతకముందు ఉత్తరప్రదేశ్, జార్ఖాండ్లలో రహస్య ఓటింగ్ పద్ధతే జరిగినట్టు గుర్తుచేశారు.