టాటా, డొకోమో వివాదానికి ముగింపు
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారసంస్థ టాటా గ్రూప్ మేజర్ ఆపరేటింగ్ ప్రమోటర్ టాటా సన్స్ లిమిటెడ్, జపాన్‌కు చెందిన టెలికాం కంపెనీ నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ (ఎన్‌టీటీ) డొకోమో మధ్య వివాదపరిష్కారానికి ఎట్టకేలకు ముగింపు పడింది. టాటా టెలీసర్వీసెస్, డొకొమో సేవల నేపథ్యంలో ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టాటా సన్స్, ఎన్‌టీటీ డొకోమో ఒక అంగీకారానికి వచ్చాయి. ఎన్‌టీటీ కోరుతున్న పూర్తిస్థాయి నష్టపరిహార మొత్తాన్ని చెల్లించేందుకు ప్రమోటర్ టాటా సన్స్ అంగీకరించింది. 1.17బిలియన్ డాలర్లను చెల్లించేందుకు టాటాగ్రూప్ అంగీకరించడంతో ఈ వివాదం పరిష్కారమైంది. దీంతో సుమారు రెండు సంవత్సరాలకుపైగా సాగుతున్న వివాదాన్ని ముగిసినట్టయింది.
తమ మధ్య వివాదాన్ని ముగింపు పలకనున్నట్టు ఇరు సంస్థలు మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు డొకోమోపై ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు టాటా సన్స్ అంగీకరించింది. మార్చి 8 దీనికి సంబంధించిన అప్లికేషన్ ను కోర్టు పరిశీలించనుంది. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యానికి వ్యతిరేకంగా తాము ఈ నిర్ణయం తీసుకోలేదని ఇరు సంస్థలు స్పష్టం చేశాయి.
గత సంవత్సరం టాటా సన్స్ ఛైర్మన్ గా సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత, డొకొమొ వివాదం పరిష్కారం చర్చలను పునఃప్రారంచింది టాటా గ్రూపు. అయితే విదేశీ పెట్టుబడి నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందనే సంకేతాలను కేంద్రబ్యాంకు వెల్లడించింది. మరోవైపు ఈ వార్తలతో టాటా టెలీ సర్వీసెస్ కౌంటర్‌కు మార్కెట్లో డిమాండ్ పుట్టింది. ట్రేడర్ల కొనుగోళ్లతో దాదాపు 9 శాతం లాభాలతో కొనసాగుతోంది.
టాటా సన్స్ తో కలసి టాటా టెలి సర్వీసెస్ లో వాటాల బదలీపై ముందు చేసుకున్న ఒప్పందాన్ని టాటా సన్స్ పాటించలేదని డొకోమో ఆరోపించింది ఈ వివాదంలో మధ్యవర్తిత్వం కోరుతూ డొకోమో లండన్‌లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంలో సుమారు ఎనిమిదివేల కోట్ల రూపాయల భారీ జరిమానా చెల్లించాలని కోర్టు తీర్పుచెప్పింది. డొకొమోతో చేసుకున్న ఒప్పందాన్ని బేఖాతరు చేశారని ఆరోపణలపై 1.17 బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని లండన్ లోని అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.