సైరస్ మిస్త్రీని ఎందుకు తప్పించారు?
సైరస్ మిస్త్రీని ఎందుకు తప్పించారు?
Published Mon, Oct 24 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
దేశీయ అతి పెద్ద ప్రైవేటు కార్పొరేట్గా పేరుగాంచిన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజి మిస్త్రీని తప్పించడం వెనుక కారణాలేమిటా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటాను నియమిస్తూ బోర్డు సోమవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. చైర్మన్ పదవి మార్పునకు టాటా గ్రూప్ ఎలాంటి కారణాలు వెల్లడించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. లాభాపేక్ష లేని వ్యాపారాలపై మిస్త్రీ అశ్రద్ధ వహించడం, వాటి విక్రయాలు జరుపుతూ ఇటీవల పలు నిర్ణయాలు తీసుకోవడం ఆయనపై వేటు వేయడానికి కారణాలుగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. వాటిలో మేజర్ డీల్ యూరప్లో ఉక్కు వ్యాపారాలను విక్రయించడం.
సైరస్ మిస్త్రీ నేతృత్వంలోనే యూరప్‌లో తమకున్న యూరప్లో లాంగ్ ప్రొడక్ట్స్ ఉక్కు వ్యాపారాన్ని విక్రయించినట్లు టాటా స్టీల్ (యూకే) ప్రకటించింది. కేవలం ఆదాయాలపై మాత్రమే శ్రద్ధ వహించడం, లాభాపేక్ష లేని వ్యాపారాల నుంచి వైదొలగడం వంటివి మిస్త్రీ నిర్వహించే వాటిలో టాటా సన్స్కు అసంతృప్తి కలిగించే అంశాలుగా మారినట్టు సమాచారం. దీంతో కంపెనీ బోర్డు సైరస్ మిస్త్రీని తొలగించిందని వాదన వినిపిస్తోంది. బోర్డు సామూహికంగా ఈ నిర్ణయం తీసుకుందని, ప్రిన్సిపల్ షేర్హోల్డర్స్ (టాటా ట్రస్ట్స్) ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం వెలువడినట్టు టాటా గ్రూప్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. టాటాసన్స్, టాటా గ్రూప్ దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుకూలంగా ఆయన్ను మార్పు చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆపరేటింగ్ స్థాయిలోని సీఈవోలో ఎలాంటి మార్పులు లేవని ఆయన తెలిపారు. నాలుగు నెలలో శాశ్వత చైర్మన్ను గ్రూప్ నియమిస్తుందని ప్రకటించారు.
Advertisement