
'ప్రతి నెలా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే'
హైదరాబాద్: నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరగా.. ఎమ్మెల్యేలకు నేరుగా 2 కోట్ల రూపాయల నిధులు ఇవ్వలేనని ఆయన చెప్పారు. సోమవారం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది.
సంక్షేమ పథకాల అమలు గురించి చంద్రబాబు ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. ప్రతినెలా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయిస్తానని చంద్రబాబు చెప్పారు. సర్వే ఆధారంగా వచ్చే నివేదికతో పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. పనితీరు మెరుగుపర్చుకుంటేనే భవిష్యత్ బాగుంటుందని చెప్పారు. ఎమ్మెల్సీలకు కూడా నిధులు కేటాయించలేనని తెలిపారు. ఇదిలావుండగా ఇసుక పాలసీ విధానంలో అవకతవకలపై ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.