జిల్లాస్థాయిలో సమీక్షలేవి?
మంత్రులు, ఎమ్మెల్యేలకు బాబు క్లాస్
♦ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం
♦ ఫిరాయింపులను ప్రోత్సహించాలని సూచన
♦ ప్రతి సోమవారం ప్రజలకు అందుబాటులో ఉండాలి
సాక్షి, హైదరాబాద్: మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరించరాదని, జిల్లా నేతలతో మంత్రులు, స్థానిక నేతలతో ఎమ్మెల్యేలు సమన్వయంతో మెలగాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సూచించారు. టీడీపీ గెలిచి అధికారం చేపట్టి 18 నెలలైనా మంత్రులు ఇంత వరకూ ఒక్కసారి కూడా జిల్లాస్థాయిలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సమీక్షలు నిర్వహించిన సందర్భాలు లేవని, కనీసం సమావేశాలు పెట్టే తీరిక లేకుండా పనిచేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం టీడీఎల్పీ సమావేశం అసెంబ్లీ కమిటీ హాలులో చంద్రబాబు అధ్యక్షతన జరిగింది.
మంత్రులు తమ శాఖల పర్యవేక్షణలో విఫలమౌతున్నారని, పనితీరు బాగా లేదని చంద్రబాబు తప్పుపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక పరి స్థితి బాగా లేకపోయినా కేంద్రం నుంచి నిధులు తెచ్చి, అప్పులు తీసుకొచ్చి పథకాలు చేపడుతున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నార న్నారు. ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇం దుకు వచ్చే ఏడాది జనవరి రెండో తేదీ నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమాన్ని వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. పథకాలపై పత్రికల్లో వ్యతి రేక వార్తలు వస్తున్నాయని, అందువల్ల పథకాలను పర్యవేక్షించాలన్నారు.
తాను సోమవారం శాసనమండలి సమావేశానికి వెళితే పార్టీ నుంచి ఎక్కువ సంఖ్యలో ఉన్న ఎమ్మెల్సీలతో ఆ సభ కళకళలాడుతోందన్నారు. వచ్చే ఎన్నికల అనంతరం శాసనసభ కూడా ఇదే తరహా లో కళకళలాడాలన్నారు. మంత్రులు విజయవాడలో, ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతి సోమవారం అందుబాటులో ఉండాల న్నారు. స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలని, పార్టీకి ఉపయోగపడతారనుకునే ఇతర పార్టీల వారిని టీడీపీలో చేర్చాలన్నారు.