సాక్షి, హైదరాబాద్: టీడీపీ శాసనసభాపక్ష నేతగా నారా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి (పత్తికొండ) ప్రతిపాదించగా పీతల సుజాత (చింతలపూడి), పతివాడ నారాయణస్వామి నాయుడు (నెల్లిమర్ల), నిమ్మకాయల చినరాజప్ప (పెద్దాపురం) బలపరిచారు. బాబు టీడీఎల్పీ నేతగా ఎన్నిక కావటం ఇది వరుసగా అయిదోసారి. చంద్రబాబు తన విద్యార్థి రాజకీయాలను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభించారు.
అదే విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సెనెట్ హాల్‌లో బుధవారం రాత్రి సమావేశమైన టీడీఎల్పీ తమ నేతగా చంద్రబాబును ఎన్నుకుంది. ఈ ఎన్నిక ద్వారా ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 1995 నుంచి చంద్రబాబు వరుసగా టీడీఎల్పీ నేతగా ఎన్నికవుతూ వస్తున్నారు. గత నాలుగు విడతలు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని టీడీఎల్పీకి నేతగా ఎన్నికవగా, ఈసారి 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు.
ఈ సమావేశానికి హాజరయ్యేందుకు చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. కొద్దిసేపు పద్మావతి అతిధి గృహంలో విశ్రాంతి తీసుకున్న ఆయన నేరుగా సెనెట్ హాల్‌కు చేరకుని టీడీఎల్పీ భేటీలో పాల్గొన్నారు. నేతగా ఎన్నికైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు ఇచ్చారు. బాబు రాత్రికి తిరుమలలో బస చేశారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని అనంతరం హైదరాబాద్‌కు తిరిగివస్తారు.
ఎన్‌టీఆర్‌కు నివాళి
వర్సిటీలోని సెనెట్ హాల్‌కు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ నేతలు, కాార్యకర్తలు పుష్పగుచ్ఛాలు, పూలదండలతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు అక్కడ ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు కేఈ కృష్ణమూర్తి, పతివాడ నారాయణస్వామి, నందమూరి బాలకృష్ణలను సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ వేదికపైకి ఆహ్వానించారు. ఆ వెంటనే టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకుంటూ కేఈ కృష్ణమూర్తి తీర్మానాన్ని ప్రతిపాదించారు. సభ్యులంతా క రతాళ ధ్వనులతో బలపరిచారు. ఎమ్మెల్యేలంతా నిలబడి చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ ఈ ఎన్నిక కేవలం రాజ్యాంగ పరమైన కార్యక్రమమన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ కాలం సీఎంగా ఉన్న ఘనత చంద్రబాబుదని చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆశాదీపంగా బాబును అభివర్ణించారు. రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్మినట్లు చెప్పారు. ఎమ్మెల్యే పీతల సుజాత మాట్లాడుతూ.. చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నరేంద్ర ప్రకటించారు. ఎమ్మెల్యేలు చంద్రబాబుకు శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. కొందరు పాదాభివందనం సైతం చేశారు.
అభివృద్ధి చేస్తారని గెలిపించారు: యనమల
ఇది మరువలేనటువంటి రోజని ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తన అభినందన ప్రసంగంలో అన్నారు. ‘మన నాయకుడు చేసిన కృషి మరువలేనిది. పది సంవత్సరాలు కృషి చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. మనందరికీ నాయకత్వ లక్షణాలు నేర్పింది ఆయనే. చంద్రబాబు అభివృద్ధి చేయగలరనే నమ్మకం ప్రజల్లో ఉండటం వల్లే తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చింది’ అని అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివిన చంద్రబాబు అక్కడే శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావటం విశేషమన్నారు. ప్రజలు అభివృద్ధికి ఓటు వేసి చంద్రబాబును అధికారంలోకి తెచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు పరిచి, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (శ్రీకాళహస్తి), సిద్ధా రాఘవరావు (దర్శి), కోడెల శివప్రసాదరావు (సత్తెనపల్లి), కొల్లు రవీంద్ర (మచిలీపట్నం), ముడియం శ్రీనివాస్ (పోలవరం), రావెల కి షోర్ బాబు (ప్రత్తిపాడు), వెంకటరమణ (తిరుపతి), మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ), గొల్లపల్లి సూర్యారావు (రాజోలు), బగ్గు రమణమూర్తి (నరసన్నపేట), నిమ్మల రామానాయుడు (పాలకొల్లు),వర్మ (పిఠాపురం), పల్లె రఘునాధరెడ్డి (పుట్టపర్తి), ఎమ్మెల్సీ ఎస్‌వీ సతీష్‌కుమార్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాన్ని గుర్తుచేస్తూ.. చంద్రబాబు నాయుడి కృషి అమోఘమంటూ అభినందనలతో ముంచెత్తారు. పార్టీని గెలిపించిన చంద్రబాబుకు, టీడీపీకి విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ధూళిపాళ్ల ప్రవేశపెట్టిన తీర్మానాన్ని టీడీఎల్పీ ఏకగ్రీవంగా ఆమోదించింది.