సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకూ వెళ్లింది. టీడీఎల్పీ సమావేశం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ఓవైపు సన్నాహాలు చేస్తుంటే...మరోవైపు ఎల్.రమణ మాత్రం పార్టీతో పాటు టీడీపీఎల్పీ కార్యక్రమాలేవీ నిర్వహించవద్దని రేవంత్‌కు ఆదేశాలు జారీ చేశారు.
దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ’ టీడీఎల్పీ నేతను నేనే. సమావేశం నిర్వహించే హక్కు నాకే ఉంది. ఎల్పీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఎల్. రమణ ఎవరు? ఆయన తన పని తాను చూసుకుంటే మంచిది.’ అని హితవు పలికారు. అయితే రేవంత్ టీడీఎల్పీ సమావేశం ఉంటుందని ప్రకటన చేస్తే...ఎల్.రమణ అదే సమయంలో గోల్కొండ హోటల్‌లో టీడీపీ-బీజేపీ నేతల సమావేశం ఉంటుందని పోటీగా ప్రకటన చేయడం విశేషం. మరోవైపు ఎల్.రమణ ...పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ పదవి నుంచి రేవంత్‌ను తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment