హమ్మయ్య ... ఓ పనితప్పింది
గుండెల మీద భారమేదో తీరిపోయినట్లు ... హమ్మయ్యా అనుకుంటూ.. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటున్నారు తెలంగాణ టీడీపీ నేతలు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతోంది.. వీటిపై పోరాటాలు చేస్తామని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరో విధంగా ఉంది. ఏ ఆందోళన చేపట్టినా అది విజయవంతం అవుతుందన్న నమ్మకం, భరోసా 'తమ్ముళ్ల' కే లేదు. ప్రభుత్వం చీప్‌లిక్కర్‌పై వెనకడుగు వేయడంతో స్వీట్లు పంచి పండుగ జేసుకుంటున్న టీడీపీ నేతల రిలీఫ్‌కు ఓ కారణం ఉంది.
చీప్‌లిక్కర్‌కు వ్యతిరేకంగా ఈ నెల 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 'తెలుగు మహిళ' ల ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ప్రకటించారు. ఈ ధర్నాలు విజయవంతం చేయడం కోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తే ఎమ్మెల్యేలు, సీనియర్లు వ్యతిరేకించారు. దీంతో ఈ ధర్నాల గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని తెలంగాణ నాయకత్వం బెంగ పెట్టుకుంది. కానీ, కాగల కార్యం గంధర్వులు తీర్చారన్న విధంగా ఈ నెల 2వ తేదీన కేబినెట్ భేటీ అనంతరం సీఎం చీప్‌లిక్కర్ లేదు...ఏం లేదని తేల్చి చెప్పడంతో 'హమ్మయ్య.. ధర్నా బాధ తప్పింది.. ధర్నాలకు రమ్మని ఎవడ్ని బతిమిలాడాల్సిన పనిలేదు. ఇలాగైనా పరువు దక్కింది..'అంటూ సంబరపడిపోతున్నారు.