సాక్షి, వికారాబాద్: వికారబాద్ జిల్లా పరిధిలోని 19 మండలాల్లోని మద్యం దుకాణాల యజమానులు ధనార్జనే ధ్యేయంగా మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో మద్యం ప్రియులకు ఏది అసలో ఏది కల్తీనో తెలియని పరిస్థితి. టెండర్లలో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారస్తులు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలనే ఆలోచనతో మద్యాన్ని కల్తీ చేస్తున్నారు.
దీంతో మద్యం కల్తీ చేసే వారిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి గుట్టుగా దంగా చేస్తున్నారనే ఆరోపణలు ఊపందుకున్నాయి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన బాటిళ్ల మూతలు ఓపెన్ చేసి అందులో చీప్ లిక్కర్, నీటిని కలిపి మల్లీ యథావిధిగా సీల్ చేస్తున్నారు. ఈ వ్యవహారం చాలా రోజులుగా జరుగుతున్నా అధికారులు తమకేమీ తెలియనట్లు గా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
బ్రాండ్‌లన్నీ కల్తీమయం
జిల్లా ఎక్సైజ్ పరిధిలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో మొత్తం 59 వైన్ షాపులు, ఐదు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటికి తోడు గ్రామాలు, తండాల పరిధిలోని ఐదు నుంచి పది వరకు బెల్టు షాపులు ఉన్నాయి. తక్కువ ధరకు లభించే మద్యాన్ని ఎక్కవ ధర ఉన్న బాటిళ్లలో స్టిక్కర్లు, లేబుళ్లను మార్చుతూ విక్రయిస్తున్నారు. ప్రధానంగా పరిగి నియోజకవర్గంలోని పలు దుకాణాల్లో ఈ దందా కొనసాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన తాండూరు, కొడంగల్ లోనూ కొనసాగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. పెరిగిన మద్యం ధరలతో ఈ కల్తీ ప్రక్రియ మరింత ఎక్కువగా సాగుతోంది.
చదవండి: హైదరాబాద్‌లో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠా గుట్టురట్టు
వేసిన సీల్ వేసినట్లే..
అధిక ధరలున్న మద్యం సీసాల లేబుళ్లను, స్టిక్కర్లను ఏమాత్రం తేడా లేకుండా ఓపేన్ చేసి మళ్లీ సీల్ వేసేందుకు కొన్ని వైన్‌షాపుల యజమానులు స్థానికేతరులను, కల్తీ చేయడంతో అనుభవం ఉన్నవారిని తీసుకువస్తున్నట్లు సమాచారం. వారికి ఎక్కువ మొత్తంలో జీతాలు ఇచ్చి మద్యాన్ని ఇష్టానుసారంగా కల్తీ చేయిస్తున్నట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రముఖ బ్రాండ్లలో 25శాతం మద్యాన్ని బయటకు తీస్తూ బదులుగా నీటిని కలుపుతున్నారు. లేదంటే తక్కువ ధరకే లభ్యమయ్యే చీప్ లిక్కర్ ఇతర మందులను కలుపుతూ కల్తీ చేస్తున్నారు. దీంతో వైన్స్ యజమానులు మూడు పువ్వులు, ఆరుకాయలుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. బెల్టు షాపుల్లోనూ ఈ తరహా వ్యాపారమే కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
నామమాత్రపు తనిఖీలు
జిల్లాలో ఇంత భారీగా మద్యం కల్తీ చేస్తున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తుల్లో జోగుతూ కల్తీ మద్యం తయారీకి వత్తాసు పలుకుతున్నారని చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు
మద్యం షాపుల్లో కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా కేటుగాళ్లు తయారయ్యారు. ప్రమాదకర, విషపూరిత రసాయనాలు కలిసి అసలు ఏదో.. నకిలీ ఏదో తెలియకుండా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment