హెచ్ఎం కీచకపర్వం
- విద్యార్థినిని లొంగదీసుకున్న టీచర్
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
తిరుమలాయపాలెం: పేదరికంలో ఉన్న విద్యార్థినికి మాయమాటలు చెప్పాడు. ఉన్నత చదువులు చెప్పించి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. కీచకుడిగా మారి కొన్నేళ్లుగా శారీరకంగా అనుభవిస్తున్నాడు. ఎలాగోలా అతడి చెర నుంచి బయటపడ్డ విద్యార్థి శుక్రవారం రాత్రి తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడుకు చెందిన విద్యార్థిని 8వ తరగతి చదువుతుండగా.. 2008లో బెజవాడ శంకర్‌రెడ్డి హెచ్‌ఎంగా బదిలీపై వచ్చాడు.
మంచి మాటలతో తల్లిదండ్రులను సంప్రదిస్తూ.. మీ కూతురుకు మంచి భవిష్యత్ ఉందని.. బాగా చదివించాలని చెప్పేవాడు. 2011లో పాలిటెక్నిక్ పరీక్ష రాయించాడు. హైదరాబాద్‌లోని కమల నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలలో సీటు రావడంతో ఆమెను అక్కడ చేర్పించాడు. రెండేళ్లపాటు కళాశాల హాస్టల్‌లో ఉన్న విద్యార్థిని వద్దకు అప్పుడప్పుడు వెళ్లి బయటకు తీసుకెళ్లి దుస్తులు, సెల్‌ఫోన్ కొనిచ్చాడు. ఏటీఎం కార్డు కూడా ఇప్పించాడు. స్పీక్ కంపెనీలో శిక్షణ పొందుతున్న సమయంలో ఈసీఐఎల్ హాస్టల్‌లో ఉండగా.. అక్కడికి నుంచి బయటకు తీసుకెళ్లి పార్కులు, లాడ్జీలకు తీసుకువెళ్లి మాయమాటలతో శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయూన్ని మీ వాళ్ల దగ్గర బయటపెడితే నీ ఫొటోలు బయటపెడతానని.. చంపుతానని బెదిరించేవాడు.
శంకర్‌రెడ్డి కీచక పర్వాన్ని తట్టుకోలేక చివరకు బయటపడి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా శంక ర్‌రెడ్డి ఈనెల 12 నుంచి 15 వరకు సెలవు పెట్టారు. దీనిని ఈనెల 20 వరకు పొడిగించాలని డిప్యూటీ డీఈవో ద్వారా అనుమతి తీసుకున్నాడు. అయితే హెచ్‌ఎం శంకర్‌రెడ్డిపై ఐపీసీ 366, 376 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కూతురు బాగా చదవడంతో బంగారు భవిష్యత్ ఇస్తాడని, వయసురీత్యా పెద్ద వాడు అని నమ్మితే ఇంత మోసం చేస్తాడని ఊహించలేదని విద్యార్థిని తండ్రి ‘సాక్షి’ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు.