ఈనెల 23 నుంచి అసెంబ్లీ
సీఎం కేసీఆర్ ప్రకటన
- ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు నిర్వహిస్తాం
- చంద్రబాబు తీరు మొగుణ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఉంది
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 23 నుంచి జరుపుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సచివాలయంలో ఆయన బుధవారం మంత్రివర్గ సమావేశ వివరాలను విలేకరులకు తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులపాటు సమావేశాలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన విమర్శలపై కేసీఆర్ స్పందిస్తూ.. తెలంగాణకు ఏపీ అడుగడుగునా అడ్డుపడుతోందన్నారు.
'రాష్ట్రం విడిపోయాక ఏడు మండలాలను అన్యాయంగా లాగేసుకుంది వారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ఇవ్వకుండా ఆపేసింది వారు. ఏపీ ప్రజలూ మంచిగా బతకాలని మేం కోరుకుంటున్నాం. అయినా వారికి తెలంగాణ అడ్డుపడుతోందని అంటే దాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆయన వరస మొగుణ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఉంది' అని కేసీఆర్ పేర్కొన్నారు. ఏపీ చరిత్ర పుస్తకాల్లో తెలంగాణ అంశాలను తొలగించడంపై స్పంది స్తూ... 'మంచిదే. మాకూ ఓ దారి చూపారు. తెలంగాణ చరిత్ర పుస్తకాల్లో తొలగించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి' అని వివరించారు.
8 నుంచి చైనా పర్యటన
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆహ్వానం మేరకు తాను ఈనెల 8న చైనా పర్యటనకు వెళ్తున్నానని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆ తర్వాత మూడు నెలల్లోపు కొరియా, జపాన్ దేశాల్లోనూ పర్యటించి, వారితో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నందున చైనాలో హార్డ్‌వేర్ కంపెనీలతో, మొబైల్‌ఫోన్ తయారీదారులతో, మరో రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలతో చర్చించినట్లు తెలిపారు. పేదల గృహనిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి, పెట్టుబడులు పెట్టడానికి కొన్ని చైనా కంపెనీలు సుముఖంగా ఉన్నాయని చెప్పారు. అధికారులు మరిన్ని కంపెనీలతో మాట్లాడుతున్నారని, తాను పర్యటనకు వెళ్లేలోగా మరికొన్ని కంపెనీలు జత కావొచ్చన్నారు. చైనా వెళ్లి వచ్చాక పూర్తి వివరాలను రాష్ట్ర ప్రజలకు వివరిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు.