గులాంనబీ ఆజాద్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఈ వారంలోనే పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర ఆరోగ్య మంత్రి, కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సభ్యుడు గులాంనబీ ఆజాద్ చెప్పారు. తెలంగాణ బిల్లుపై జీవోఎమ్ సమావేశం ముగిసింది. బిల్లుపై రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలు, సవరణలను పరిశీలించారు. బిల్లుకు కొన్ని సవరణలను జిఓఎం ఆమోదించింది. తుది బిల్లుని సిద్ధం చేశారు.
సమావేశం ముగిసిన తరువాత గులాంనబీ ఆజాద్ విలేకరులతో మాట్లాడారు. ఇదే ఆఖరి జీవోఎమ్ సమావేశమని ఆజాద్ తెలిపారు. ఎల్లుండి జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ నోట్ సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ వారంలోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామన్నారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్ర ప్రాంతంలోనే కలిపేందుకు జీవోఎమ్ నిర్ణయించినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 11న తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.